హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన పీవీ సింధు.. భేటీపై రియాక్షన్ ఇదే..
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన ఉత్సవాల్లో పాల్గొనేందుకు అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అమిత్ షాకు ఎయిర్‌పోర్టులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లతో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా నగరంలోని సీఆర్‌పీఎఫ్ అతిథి గృహంకు చేరుకున్నారు.
అక్కడే అమిత్ షాను పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణలు కలిశారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధును అమిత్ షా అభినందించారు. ఇక, ఈ సమావేశానికి సంబంధించి అమిత్ షా ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేశారు. ‘‘ఈరోజు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును హైదరాబాద్‌లో కలిశాను. ఆమె అసాధారణమైన క్రీడా ప్రతిభకు లభించిన అంతర్జాతీయ ప్రశంసలకు దేశం గర్విస్తోంది. ఆమె నిబద్ధత, కృషి, అంకితభావం యువ తరానికి స్ఫూర్తి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన పీవీ సింధు.. ‘‘సార్, మిమ్మల్ని కలవడం, పలు అంశాలు చర్చించడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆతిథ్యం, ఆప్యాయత అపురూపం. నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో నాకు లభించిన మద్దతు అసమానమైనది. నేను ఎంతో దృష్టి పెట్టడానికి, సాధించడానికి వీలు కల్పించింది. చాలా సపోర్టు చేసిన మీకు, అనురాగ్ ఠాకూర్, కిరెన్ రిజిజు, హిమంత బిస్వా శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు. క్రీడలు దేశాభివృద్దికి ప్రతిబింబం. భారతదేశంలో క్రీడలను ఎలా వృద్ది చెందించాలనే దానిపై మరింత సుసంపన్నమైన సంభాషణల కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.