హైదరాబాద్ లోని మెట్టుగూడలో ఓ జిమ్ ట్రైనర్‌పై కానిస్టేబుళ్ల దాష్టీకానికి పాల్పడ్డారు. కర్రలతో ఇష్టారీతిన దాడి చేసి.. అతని కాలు విరకొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. విచక్షణారహితంగా పోలీసులు దాడి చేసిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఖాకీలు అమానుషంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజానిజాలను విచారించకుండా.. కానిస్టేబుళ్లు అత్యుత్సహం ప్రదర్శించారు. అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తిపై ఒకరూ కాదు ఇద్దరూ కాదు నలుగురు కానిస్టేబుల్ విరుచుకుపడ్డారు. దుడ్డుకర్రతో, పిడిగుద్దులతో చిత్రహింసలు పెట్టారు. ఈ తీవ్రంగా గాయపడిన యువకుడి కాలు విరిగి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. విచక్షణారహితంగా పోలీసులు దాడి చేసిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పలు మీడియా కథనాల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడకు చెందిన సూర్య ఆరోఖ్యరాజ్ (25) జిమ్ ట్రైనర్ గా పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈనెల 3న మెట్టుగూడలోని తన తల్లి శీల ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి బస్తీలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వెళ్తుండగా వారించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన మొదలై.. తోపులాటకు దారితీసింది. దీంతో ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోఖ్యరాజ్ వద్దకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. రాత్రి 11 గంటలవుతోందనీ, తాను ఇప్పుడు రాలేననీ, ఉదయాన్నే వస్తానని ఆరోఖ్యరాజ్ సమాధానమిచ్చాడు .
దీంతో ఆగ్రహానికి లోనైన నలుగురు కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌పై దాడికి పాల్పడ్డారు. కర్రను అతని కాళ్ల మధ్య పెట్టి.. విచక్షణ రహితంగా బూటు కాళ్లతో తన్నారు. తనను కొట్టొద్దంటూ అతడితో పాటు తల్లి ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఆమె పైనా దాడికి యత్నించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుళ్ల దాడిలో బాధితుడికి శరీరమంతా గాయాలు కావడంతో పాటు కాలు విరిగిందని పలు మీడియా కథనాలలో వెల్లడింది. పోలీసుల దెబ్బలకు ఆరోఖ్యరాజ్ ఎడమ కాలు విరిగినట్లు, కుడికాలుకూ తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. పిడిగుద్దులతో అతడి ముఖం వాచిపోయింది. మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీసుల బేరసారాలు
మరుసటి రోజు నలుగురు కానిస్టేబుళ్లు సాధారణ దుస్తుల్లో వచ్చి బేరసారాలకు పాల్పడినట్టు బాధితుడు చెప్పారు. ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని కోరినట్లు మీడియా కథనాల సమాచారం. ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు యత్నించాడని.. తాము ప్రతిదాడి చేశామని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. తన కొడుకుపై దాడి చేసి కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని, వారిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని తల్లి శీల తెలిపింది.
