ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను అర్వింద్ రుజువు చేయాలని అన్నారు. 24 గంటల టైమ్ ఇస్తున్నారని, అంతలోపు తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని చెప్పారు. 

హైదరాబాద్: నిజామాబాద్‌లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. అందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. అంతలోపు ఆ ఆరోపణలు నిరూపించకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేయవద్దని, తమాషాలు చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పని చేస్తున్నదని, అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని కవిత వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు కమీషన్లు దండుకున్నాయని, బీఆర్ఎస్ అలా చేయదని తెలిపారు. అప్పటి ప్రభుత్వాల హయాంలో జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేసుకోలేకపోయారని, అదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను, తనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి నిర్మాణం పూర్తి చేయించుకున్నామని వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా? అంటూ అడిగారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత.. ఎంపీ అర్వింద్ పై సీరియస్ అయ్యారు. ‘అరవింద్.. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. నాకు ఎవరు పైసలు ఇచ్చిర్రో రుజువు చేయాలి. కాగితం పట్టుకురా.. లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి’ అని చాలెంజ్ చేశారు. తన తండ్రి కేసీఆర్‌ను అంటే వదిలిపెట్టానని, కానీ, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలా చేస్తే ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చారు. తన భర్త రాజకీయాల్లో లేరని, అయినా, ఆయన పేరును లాగడం ఎందుకు అని అర్వింద్‌ను ప్రశ్నించారు. ధర్మపురి అర్వింద్ ఎక్కడ నుంచి బరిలో నిలుచున్నా.. అక్కడ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తామని సవాల్ చేశారు.

మణిపూర్ అల్లర్లపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రైతు బంధు పథకానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. జాతీయ రహదారులపైనా ఎక్కడైనా గుంతలు ఉంటాయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ అర్వింద్ ఏం తెచ్చారనీ నిలదీశారు.

Also Read: తప్పుడు రిపోర్టులొద్దు, కిషన్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వండి: నేతలకు బండి చురకలు

రైతులంతా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు కాబట్టే కాంగ్రెస్‌‌కు జీర్ణం కావడం లేదని, అందుకే అక్కసు వెళ్లగక్కుతూ మూడు గంటల విద్యుత్ చాలని ప్రగల్బాలు పలుకుతున్నారని కవిత అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పైసలు ఉన్న వారి పక్షానే నిలబడుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాత్రమే పేదల వైపు నిలబడుతుందని వివరించారు. ధరణిని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదని, వారు దళారీలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నదని తెలిపారు. ధరణి తమ విధానం అని, దళారీ కాంగ్రెస్ విధానం అని విమర్శించారు. తాము ఎన్డీఏ, ఇండియా కూటములను సమాన దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్‌తోనే పోటీ అని, కానీ, కాంగ్రెస్ తమకు చాలా దూర స్థానంలో ఉంటుందని వివరించారు.

ఐటీ హబ్ యువత ఉజ్వల భవితకు బాట

నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానికు యువత ఉజ్వల భవితకు బాటలు వేస్తుందని కవిత అన్నారు. ఐటీ హబ్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే బిగాల మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. ఇది మొదటి దశ ఐటీ హబ్ అని, త్వరలో రెండో దశ ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ మేళాలో పాల్గొని యువతకు ప్రోత్సాహం అందించారు.