Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ పోర్ట్ కాదు, ముందు బస్సేయండి

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు వ్యతిరేకంగా  పోరాటం షురూ చేసిన కోదండరామ్

Professor kodandaram favors bus services over airports

ప్రొఫెసర్ కోదండరామ్ పోరాట పరిధి విస్తరిస్తూ ఉంది.

 

ఆయన భూపోరాటం ఇప్పటి దాకా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉన్న రైతులకే పరిమితమయి ఉండింది. ఇపుడాయన భూపోరాటాన్ని గిరిజన  ప్రాంతాలకు కూడా విస్తరింప చేస్తున్నాడు. కొత్తగూడెం విమానాశ్రాయం నిర్మాణం కోసం గిరిజనులను వారి భూములనుంచి గెంటేసే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఒక వైపు  తెలంగాణా నెంబర్ వన్  స్టేట్ పేరుతో చదువుకున్నోళ్లను, మేధావులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు ప్రయత్నిస్తుంటే,  జనం కోరుకున్న తెలంగాణా కొట్టుకుపోతావుందని  చదువులేనోళ్లనందరిని  కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం టాటాను, పెద్ద ఐటి దిగ్గజాలను, సానియా మీర్జా, అమితాబ్ బచ్చన్ వంటి బ్రాండ్ అంబాసిడర్లలతో  బంగారు తెలంగాణానుచూపిస్తుంటే కోదండరామ్ బక్కరైతులును, చేనేత కార్మికులను,ఇపుడు గిరిజనులనుకూడగట్టి ఇది బంగారు తెలంగాణా కాదు, కార్పొరేట్ తెలంగాణా అంటున్నారు.

 

తాజాగా ఆయన కొత్తగూడెం విమనాశ్రయం వల్ల భూములు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్న గిరిజనుల పక్షాన నిలబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయ ప్రాంతాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో నిర్వాసితులౌతున్న పునుకుడుచెలక ప్రాంత ఆదివాసీలను కలిశారు. జెఎసి మీతో ఉంటుందని ధైర్యం చెప్పారు.

 

విమానాశ్రయం వ్యతిరేక పోరాట కమిటీ సభలో మాట్లాడారు.

 

అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న విధ్వంసాన్ని ఖండించారు. ప్రాజెక్టుల పేరుతో గిరిజనులు, ఆదివాసీలు, రైతుల నుంచి తప్పనిసరిగా సేకరించాల్సి వస్తే  భూమికి పరిహారం సక్రమంగా అందజేయాలని డిమాండ్‌ చేశారు. బస్సు సౌకర్యంలేని ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయనీ, వారికి బస్సు సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేయడం విడ్డూరం కాదా అని కోదండరామ్‌ ప్రశ్నించారు.

 

ముందుగా మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండని డిమాండ్ చేశారు.

 

 భద్రాచలం, పాల్వంచ, మణుగూరు తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల సాకుతో అటవీ ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘించి విమానాశ్రయం ఏర్పాటు చేయడ ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని  చెబుతూ  భద్రాచలం వరకు రైలు సౌకర్యాన్ని పెంచే విధంగా  చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారని అన్నారు.

 

ఎక్కేవారు, దిగేవారి గురించి లెక్కలు లేకుండా గుడ్డిగా విమానాశ్రయం నిర్మాణం చేయడం అవివేకమని విమర్శిస్తూ  అడవిలో చెట్టును, భూమిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల మీద జరుగుతున్న కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 

2005 చట్టం ప్రకారం ఇక్కడి ఆదివాసీలకు భూమి హక్కును కల్పించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూసేకరణలో  2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సిందే నని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios