12 రోజుల మౌనదీక్షను విరమించిన ఐలయ్య ఓయులో జరిగిన సభలో పాల్గొన్న ఐలయ్య గతనెల 24న మౌన దీక్షకు పూనుకున్న ఐలయ్య
ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోసారి వార్తల్లోకి వచ్చారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకాన్ని రాసిన తర్వాత ఆయనపై ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున మాటల దాడికి దిగారు. దిష్టిబొమ్మల దహనాలు చేసి రెండు తెలుగు రాష్ట్రాలను హోరెత్తించారు. కోమటోళ్లను సమ్గర్లుగా పోలుస్తారా అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఒక దశలో ఐలయ్య మీద వ్యక్తిగత దాడికి దిగేందుకు ప్రయత్నించారు కూడా. పరకాలలో ఈ పరిణామం జరిగింది. దీంతో ఐలయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 24 నుంచి 12 రోజుల పాటు మౌనదీక్షలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో 12 రోజుల తర్వాత గురువారం ఆయన బయటకొచ్చారు.
ఐలయ్య రచించిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం తెలుగు నేల మీద పెద్ద దుమారాన్ని రేపింది. కోమటోళ్లుగా పిలబడే ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆందోళనలు చేపట్టారు. అన్నిచోట్ల ఐలయ్య దిష్టిబొమ్మలు కాలబెట్టి నిరసన తెలిపారు. ఐలయ్యను ఉరి తీయాలంటూ ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు.
మౌన దీక్షను వీడిన ఐలయ్య తాజాగా ఐలయ్య ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను చేపట్టిన 12 రోజుల నిరసన కార్యక్రమాన్ని ముగించేశారు.
ఆయన బయటకు రావడంతో ఇకపై మళ్లీ సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు గ్రంథంపై వివాదం కొత్త పుంతలు తొక్కే అవకాశముందా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో నెలకొన్నాయి.
