యూత్ డిక్లరేషన్‌తో యువతకు భరోసా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నిరాశలో ఉన్న యువతలో ధైర్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యూత్ డిక్లరేషన్ ద్వారా యువతలో భరోసా కల్పిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్:కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయని కేసీఆర్ ప్రచారం చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరీక్షుల నిర్వహించి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యువత తీవ్ర ఆవేదనలో ఉందని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నిరాశలో ఉన్న యువతకు భరోసా ఇచ్చేందుకు రేపు ప్రియాంక గాంధీ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఏం చేయనుందో యూత్ డిక్లరేషన్ ద్వారా ప్రకటించనున్నట్టుగా చెప్పారు. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ లాక్కుందన్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా రూ. 25 లక్షల కోట్ల విలువైన భూములను కేసీఆర్ సర్కార్ లాక్కొందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదల నుండి లాక్కున్న భూములను కార్పోరేట్లకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.