ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పిల్లలు ‘‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు -2022’’ను అందుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన పిల్లలకు ప్రతీ ఏటా ఈ అవార్డులు అందిస్తారు. ఈ సారి రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు దక్కడం గమనార్హం. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పిల్లలు ‘‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు -2022’’ని అందుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన 29 మంది పిల్లలుఈ అవార్డులను అందుకున్నారు. వీరందరినీ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇందులో తెలంగాణ నుంచి క్రీడ‌ల విభాగంలో తేలుకుంట విరాట్ చంద్ర, శౌర్యం విభాగంలో ఏపీకి చెందిన గురుగు హిమ‌ప్రియ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీలో నిర్వ‌హించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా వ‌ర్చువ‌ల్ గా నిర్వ‌హించారు. 

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు (PMRBP)- 2022 పుర‌స్కారాల‌ను పొందిన పిల్ల‌ల‌తో ప్ర‌ధాన మంత్రి వ‌ర్చువ‌ల్ గా మాట్లాడారు. స్థానికంగా ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువులకు (vocal for local) ప్రోత్సాహం అందించాల‌ని పిల్ల‌ల‌ను కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం యువ‌త కోసం ఎన్నో కొత్త విధానాల‌ను తీసుకొస్తుంద‌ని చెప్పారు. ఇండియాలోని యువ‌త వివిధ దేశాల్లో చాలా గొప్ప స్థానాల‌కు వెళ్తున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా సుభాష్ చంద్రబోస్ గొప్ప‌ద‌నాన్ని పిల్ల‌ల‌కు వివ‌రించారు. నేతాజీ నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చ‌ని చెప్పారు. అనంత‌రం పిల్ల‌ల‌తో ముచ్చ‌టించారు. వారి ఆవిష్క‌ర‌ణ‌లు, వారి అభిరుచుల‌ను తెలుసుకున్నారు. నేడు జాతీయ బాలికా శిశు దినోత్సవం సందర్భంగా దేశంలోని కుమార్తెలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. నేడు కుమార్తెలు అద్భుతాలు సృష్టిస్తున్నార‌ని చెప్పారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ స‌మ‌యంలో ఈ అవార్డుల ప్రదానం మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. 

ఏమిటీ పుర‌స్కారాలు ?

కొత్త ఆవిష్క‌ర‌ణ‌ లు, క్రీడ‌ లు, క‌ళ‌ లు, సంస్కృతి, సామాజిక సేవ‌, సాహ‌సం వంటి ప‌లు రంగాల్లో అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు ప్ర‌తీ ఏడాది ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ కింద అవార్డులు అందిస్తారు. ఈ ఏడాది 29 మంది పిల్ల‌ల‌కు ఈ పుర‌స్కారం ల‌భించింది. ఇన్నోవేషన్ విభాగంలో ఏడుగురికి, సామాజిక సేవా విభాగంలో న‌లుగురికి, స్కాల‌స్టిక్ విభాగంలో ఒక్క‌రికి, క్రీడ‌లు విభాగంలో ఎనిమిదిగురికి, క‌ళ‌లు విభాగంలో ఆరుగురికి, సంస్కృతి విభాగంలో ముగ్గురికి ఈ అవార్డులు అందించారు. ఇందులో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన పిల్ల‌లు ఉన్నారు. ఈ అవార్డు అందుకున్న వారిలో 15 మంది బాలురు ఉండ‌గా 14 మంది బాలిక‌లు ఉన్నారు. వీరందరికీ బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీ ద్వారా డిజిట‌ల్ సర్టిఫికేట్‌లు అందించారు. అలాగే రూ.1,00,000/- నగదు బహుమతిని అంద‌జేశారు. ఇవి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జ‌మ అయ్యాయి. కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ పాల్గొన్నారు. 

అవార్డు గ్ర‌హీత‌లు వీరే.. 

 పేరు కేట‌గిరి రాష్ట్రం

గౌరీ మహేశ్వరి కళ & సంస్కృతి రాజస్థాన్

రెమోనా ఎవెట్టే పెరీరా కళ & సంస్కృతి కర్ణాటక

దేవిప్రసాద్ కళ & సంస్కృతి కేరళ

సయ్యద్ ఫతీన్ అహ్మద్ కళ & సంస్కృతి కర్ణాటక

దౌలస్ లంబమయుమ్ కళ & సంస్కృతి మణిపూర్

ధృతిష్మాన్ చక్రవర్తి కళ & సంస్కృతి అస్సాం

గురుగు హిమప్రియ శౌర్యం ఆంధ్రప్రదేశ్

శివంగి కాలే శౌర్యం మహారాష్ట్ర

ధీరజ్ కుమార్ శౌర్యం బీహార్

శివం రావత్ ఇన్నోవేషన్ ఉత్తరాఖండ్

విశాలిని ఎన్ సి ఇన్నోవేషన్ తమిళనాడు

జుయ్ అభిజిత్ కేస్కర్ ఇన్నోవేషన్ మహారాష్ట్ర

పుహాబి చక్రవర్తి ఇన్నోవేషన్ త్రిపుర

అశ్వత బిజు ఇన్నోవేషన్ తమిళనాడు

బనితా డాష్ ఇన్నోవేషన్ ఒడిషా

తనీష్ సేథీ ఇన్నోవేషన్ హర్యానా

అవి శర్మ పాండిత్యం మధ్యప్రదేశ్

మీధన్ష్ కుమార్ గుప్తా సామాజిక సేవ పంజాబ్

అభినవ్ కుమార్ చౌదరి సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్

పాల్ సాక్షి సామాజిక సేవ బీహార్

ఆకర్ష్ కౌశల్ సామాజిక సేవ హర్యానా

అరుషి కొత్వాల్ క్రీడలు జమ్మూ & కాశ్మీర్

శ్రియా లోహియా క్రీడలు హిమాచల్ ప్రదేశ్

తేలుకుంట విరాట్ చంద్ర క్రీడలు తెలంగాణ

చందరీ సింగ్ చౌదరి క్రీడలు ఉత్తర ప్రదేశ్

జియా రాయ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్

స్వయం పాటిల్ క్రీడలు మహారాష్ట్ర

తరుషి గౌర్ క్రీడలు చండీగఢ్

అన్వీ విజయ్ జంజారుకియా క్రీడలు గుజరాత్