తెలంగాణకు మోడీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకొనే వ్యూహంతో పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహంతో కమల దళం కసరత్తు చేస్తుంది.
ఈ నెల 7, 8 తేదీల్లో హైద్రాబాద్ లో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 7వ తేదీన బీజేపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ ఇంచార్జీ సునీల్ భన్సల్ సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.
2023 నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాదు 19 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. 2018తో పోలిస్తే 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి మెరుగైన ఓట్లు దక్కాయి.
దీంతో తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ అభ్యర్ధులు ఎక్కువగా విజయం సాధించారు. బీజేపీ గెలుపొందిని ఎనిమిది స్థానాల్లో ఎక్కువగా ఉత్తర తెలంగాణ నుండే ఉన్నాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయితే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 నుండి 12 స్థానాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ఆ పార్టీ కసరత్తు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి ప్రధాని మోడీతో రెండు సభలు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో ఒక సభను నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది.
తెలంగాణలో ప్రధాన మంత్రి మోడీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు తరుచుగా పర్యటించేలా ఆ పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుంది. దాదాపుగా పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రజలు పొందిన లబ్దితో పాటు రానున్న రోజుల్లో ఏ రకమైన కార్యక్రమాలను తీసుకు రానున్నామనే విషయాలపై కూడ బీజేపీ నాయకత్వం ప్రచార కార్యక్రమాలను రూపొందించనుంది.
also read:మిషన్ ఇంపాజిబుల్ సినిమా తరహాలోనే: కేబుల్ వైర్లపై పిల్లి వాకింగ్, నెట్టింట్లో వీడియో వైరల్
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును, లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో కూడ కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కేంద్రీకరించింది. దక్షిణాది రాష్ట్రాల నుండి మెజారిటీ ఎంపీలను దక్కించుకోవడంపై ఆపార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడంపై బీజేపీ నాయకత్వం వ్యూహలు రచిస్తుంది.
also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు
తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయాలని బీజేపీ తెలంగాణ నేతలు కూడ కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. తెలంగాణ నుండి నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం తెలంగాణతో పాటు దక్షిణాదిపై కూడ ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో మోడీ పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.మరోవైపు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జీలను కూడ ఆపార్టీ ఇవాళ ప్రకటించింది.