మజ్లిస్ చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్:పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారన్న మోడీ
బీఆర్ఎస్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. మజ్లిస్ చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్ ఉందన్నారు.
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ సర్కార్ మజ్లిస్ చేతిలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో ప్రజలకు తెలుసునన్నారు.
అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన రెండు కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఈ రెండు కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఈ రెండు కుటుంబాలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా పార్టీలను నడుపుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శలు చేశారు. బీజేపీపై ప్రజలు చూపిన ప్రేమ చూస్తే ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టదని ఆయన ఎద్దేవా చేశారు.
పార్టీ పదవుల్లో కుటుంబ సభ్యులు, దగ్గరి వ్యక్తులు మాత్రమే ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.రాజకీయ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారు. పార్టీ అధ్యక్షుడి నుండి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారన్నారు. ఆ కంపెనీలో డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ సహా అన్ని పదవులు కూడ ఆ కుటుంబ సభ్యులవేనన్నారు. కొన్ని అవసరాల కోసం కొందరిని సహాయకులుగా నియమించుకున్నారన్నారు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుందని మోడీ వివరించారు. పార్టీ ఆఫ్ ది ఫ్యామిలీ,బై ది ఫ్యామిలీ,ఫర్ ది ఫ్యామిలీ అన్నది వాళ్ల నినాదమని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారన్నారు.తెలంగాణ ప్రజలు కూడ ఇదే కోరుకుంటున్నారన్నారు.ఇచ్చిన హామీని నెరవేర్చాలనేది తెలంగాణ ప్రజల కోరికగా మోడీ పేర్కొన్నారు.కలిసికట్టుగా తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామన్నారు.పాతమిత్రులను కలిసి తన జీవితం ధన్యమైందని మోడీ చెప్పారు.ప్రతి కుటుంబం బీజేపీ ఆలోచిస్తుందని మోడీ పేర్కొన్నారు.
also read:తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: పాలమూరు ప్రజా గర్జన సభలో మోడీ
భారత్ నుంచి పసుపు , సుగంధ ద్రవ్యాల ఎగుమతి భారీగా పెరిగిందని మోడీ పేర్కొన్నారు.పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్రంలో పసుపు ఉత్పత్తి మరింత పెరగనుందని మోడీ పేర్కొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు,కళలకు ఎంతో ప్రత్యేక ఉందన్నారు.దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి బిద్రీ కళాఖండాన్ని తాను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు.ఈ మధ్యే విశ్వకర్మ పథకం ప్రారంభించినట్టుగా చెప్పారు.చేతివృత్తుల కళాకారులను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.ములుగు జిల్లాలో సమ్మక్మ, సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్రం భూమిని కేటాయించలేదన్నారు. దీంతోనే యూనివర్శిటీ ఆలస్యమైందని ప్రధాని వివరించారు.తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని ఆయన విమర్శించారు.