తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: పాలమూరు ప్రజా గర్జన సభలో మోడీ
నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అనిపిస్తుందన్నారు.మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పనిచేసే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. అబద్దపు వాగ్ధానాలు కాదు...క్షేత్రస్థాయిలో ప్రజలకు పనులు కావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.వచ్చే ఎన్నికల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటుకానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ గడ్డను రాణిరుద్రమలాంటి వీరనారీమణులు పాలించారని ఆయన గుర్తు చేశారు. ఇటీవలనే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళల జీవితాలను మెరుగుపర్చేందుకు అనేక చర్యలను తీసుకున్నామన్నారు.రానున్న రోజుల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగనుందని ఆయన చెప్పారు.
ఢిల్లీలోని ఓ సోదరుడు ఉన్నాడని నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.మహిళల కోసం దేశ వ్యాప్తంగా లక్షల టాయిలెట్లు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఎటువంటి గ్యారెంటీ లేకుండా ముద్ర రుణాలు అందిస్తున్నట్టుగా మోడీ వివరించారు.
రాష్ట్రంలో 2014 వరకు కేవలం 2500 కి.మీ మేర మాత్రమే జాతీయ రహదారులున్నాయన్నారు.తమ ప్రభుత్వం 9 ఏళ్లలో 2500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించినట్టుగా చెప్పారు.2014కు ముందు అప్పటి కేంద్రం రూ. 3400 కోట్లు ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.తమ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 27 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసిందన్నారు.
తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపీడీ చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని లబ్దిపొందిన సర్కార్... ఆ తర్వాత రైతులను విస్మరించిందని ఆయన విమర్శించారు. రుణమాఫీ చేయని కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.రాష్ట్రంలో తమ ప్రభుత్వం లేకపోయినా రైతులను ఆదుకొన్నామని మోడీ తెలిపారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి ఎరువుల కొరత తీర్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు.జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణలోని పసుపు రైతులకు మేలు జరుగుతుందన్నారు.తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపీడీ చేస్తుందని ఆయన చెప్పారు.
also read:తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు: మహాబూబ్‌నగర్ లో ప్రధాని మోడీ వరాల జల్లు
ప్రజలందరికీ నమస్కారాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. నా కుటుంబ సభ్యులారా అంటూ తన ప్రసంగంలో మోడీ పదే పదే ప్రస్తావించారు. దేశ ప్రజలు స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చారన్నారు. ఇక్కడకు వచ్చే ముందు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలు స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చారన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇవాళ శుభదినంగా ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో రూ. 13, 500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్టుగా మోడీ చెప్పారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టుగా మోడీ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.