తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు: మహాబూబ్‌నగర్ లో ప్రధాని మోడీ వరాల జల్లు
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మహబూబ్ నగర్ లో ప్రకటన చేశారు.
మహబూబ్ నగర్: తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో రూ. 13, 500 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత పసుపుపై పరిశోధనలు పెరిగాయని మోడీ పేర్కొన్నారు.కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని మోడీ పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మోడీ పేర్కొన్నారు.ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మక్క, సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 900 కోట్లతో యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు.చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో పాసైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దేశంలో పండుగల సీజన్ మొదలైందన్నారు.
తెలంగాణలో రూ. 13, 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎందరికో ఉపాధి దక్కుతుందన్నారు. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడ తీసుకువచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైవేల నిర్మాణంతో తెలంగాణకు అన్ని రాష్ట్రాలతో అనుసంధానం పెరిగిందన్నారు. దేశంలో నిర్మించే ఐదు టెక్స్ టైల్స్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేశారు. హన్మకొండలో నిర్మించే టెక్స్ టైల్స్ పార్క్ తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల మనస్సులో ఉన్నదే మాట్లాడుతానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.మాట్లాడాల్సిందంతా అక్కడే మాట్లాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్వహించే సభలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోననే ఆసక్తి నెలకొంది.