ఆమె ఓ నిండు గర్భిణీ.. మరో రెండు, మూడు రోజుల్లో డెలివరీ కానుంది. ఈ క్రమంలో సడెన్ గా ఆమెకు అర్థరాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చేలోపే ఆమెకు పూనకం వచ్చింది.  ఆ తర్వాత నొప్పలు ఆగిపోయాయి. దీంతో.. కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. 

తెల్లారాక తీసుకువస్తామని చెప్పి వెళ్లారు. అయితే.. విచిత్రం ఏమిటంటే.. తెల్లారేసరికి ఆమె గర్భం మాయమైంది. అలా అని ఆమెకు డెలివరీ కూడా కాలేదు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది ఈ వింత చోటుచేసుకుంది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మంజులకు సమీప చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన చాలాకాలం తర్వాత 9నెలల క్రితం మంజుల గర్భం దాల్చింది. తాజాగా పురుడు కోసం తన పుట్టింటికి వెళ్లింది. శనివారం రాత్రి మంజులకు నొప్పులు వస్తుండటంతో స్థానిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లగా.. ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోయింది.

దీంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయారు. మరుసటి ఉదయం మంజులను ఆశావర్కర్లు పరీక్షించగా ఆమెకు గర్భం లేదని తేలింది. ఆస్పత్రిలో వైద్యుల పరీక్షలో ప్రసవం అయినట్టు కూడా ఆనవాళ్లు లేవని తేలింది.

 ఏడు నెలల పాటు మంజులను తానే పరీక్షించానని, అయితే.. గడచిన నెలరోజులుగా ఆమె ఆస్పత్రికి రాలేదని వైద్యురాలు పేర్కొన్నారు. బహుశా నెల క్రితం ఆమెకు గర్భస్రావం అయి ఉండవచ్చని, ఆ విషయాన్ని దాచేందుకు మహిళ నటిస్తుండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమెకు మతిస్థిమితం కూడా సరిగ్గా లేనందున మానసిక చికిత్సాసుపత్రికి తీసుకెళ్లాలని లేఖ రాసి ఇచ్చినట్లు తెలిపారు.