ప్రసవవేదనతో హాస్పిటల్ కు వెళుతున్న నిండు గర్భిణిని వరదనీరు చుట్టుముట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. ఇలా నిజామాబాద్ జిల్లా భీంగల్ లో నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ వరద నీటిలో చిక్కుకున్న ఘటన వెలుగుచూసింది. వరద నీరు చుట్టుముట్టడంతో గర్భిణి భర్తతో పాటు కుటుంబసభ్యులు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో వుండిపోయారు. చివరకు ఓ జేసిబి సాయంతో గర్భిణిని వరద ప్రవాహాన్ని దాటించి హాస్పిటల్ కు చేర్చడంతో ప్రమాదం తప్పింది.

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన అనిల నిండు గర్భిణి. గురువారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళుతుండగా ఒక్కసారిగా వరదనీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ఓ చెరువు కట్ట తెగడంతో పిప్రి నుండి బాచన్ పల్లికి వెళ్లేదారి నీటమునిగింది. నీటిప్రవాహం అధికంగా వుండటంతో గర్భిణి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

అయితే పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి స్థానికులు చలించిపోయారు. వెంటనే జెసిబి సాయంతో గర్భిణితో కుటుంబసభ్యులు నీటిప్రవాహాన్ని దాటించారు. అప్పటికే అటువైపు 108 అంబులెన్స్ రెడీగా వుండగా అందులో గర్భిణిని ఆర్మూర్ హాస్పిటల్ కు తరలించారు. గర్భిణి మహిళతో పాటు కడుపులోని బిడ్డ కూడా సురక్షితంగా వుండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More Telangana Rains: తెలంగాణలో కొత్త రికార్డులు సృష్టించిన వ‌ర్షాలు..

ఇదిలావుంటే మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ గర్భిణి మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంటిగోడ కూలి గర్భిణిపై పడటంతో కడుపులోని శిశువు మృతిచెందాడు. గర్భిణి పరిస్థితి కూడా విషమంగా వుంది. 

మెదక్ పట్టణంలోని మిలట్రీ కాలనీలో నివాసముండే మహ్మద్ సర్వర్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతడి రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. మరో 15 రోజుల్లో ఆమె ప్రసవం జరగాల్సి వుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గర్భిణి ఇంట్లో వున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూడి ఆమెపై పడింది. దీంతో యాస్మిన్ తీవ్రంగా గాయపడగా కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. గర్భంలోని శిశువు మృతిచెందగా యాస్మిన్ పరిస్థితి కూడా విషమించడంతో హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.