మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న  మారుతీరావుకు  మార్కెట్ విలువ ప్రకారంగా సుమారు రూ.  200 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నాయని  పోలీసులు ప్రకటించారు. పోలీసులు మంగళవారం నాడు దాఖలు చేసిన చార్జీషీట్‌లో ఆస్తుల వివరాలను ప్రకటించారు.

మార్కెట్ విలువ ప్రకారంగా  మారుతీరావు ఆస్తుల విలువ సుమారు  రూ. 200 కోట్లు ఉంటుందని  చార్జీషీటులో పేర్కొన్నారు. కిరోసిన్ డీలర్‌గా మారుతీరావు వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.

Also read:ప్రణయ్ హత్య: 1200 పేజీలతో చార్జీషీట్, ఏ-1 మారుతీరావు

కిరోసిన్ డీలర్ నుండి మారుతీరావు రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. రైస్ మిల్లు వ్యాపారం ఆయనకు కలిసి వచ్చింది.  అయితే 15 ఏళ్ల క్రితం మారుతీరావు రైసు మిల్లు వ్యాపారాన్ని మానేశాడు. 

తనకు ఉన్న రైస్ మిల్లులను విక్రయించాడు. రైస్ మిల్లు వ్యాపారం నుండి మారుతీరావు  రియల్ ఏస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. మారుతీరావు  తల్లి పేరున మిర్యాలగూడలో రెండు అంతస్థుల షాపింగ్  కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో 22 గుంటల భూమి ఉంది.  మరో వైపు మిర్యాలగూడలో అమృత ఆసుపత్రి ఉంది.ఈ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిగా  ఉంది.

మిర్యాలగూడలో భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి ఉంది.  హైద్రాబాద్ కొత్తపేటలో 400 గజాల ప్లాట్ ఉంది. హైద్రాబాద్ తో పాటు పలు చోట్ల ఐదు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. మిర్యాలగూడ ఈదులగూడలో షాపింగ్ మాల్ ఉంది. 

శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఏస్టేట్ వెంచర్ లో వంద విల్లాలను మారుతీరావు, శ్రవణ్‌కుమార్ లు విక్రయించారు.. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారంగా రూ. 200 కోట్లు ఉంటుందని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.


ప్రణయ్ హత్యకు ముందే శ్రవణ్ పేరున వీలూనామా

ప్రణయ్ ను 2018 సెప్టెంబర్ 14వ తేదీన కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించినట్టుగా పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు. చార్జీషీట్‌లో  వీలూనామా గురించి కూడ పోలీసులు ప్రకటించారు.  మారుతీరావు తన ఆస్తిని  2018 ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య  వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు చార్జీషీట్‌లో ప్రకటించారు. మారుతీరావు తన భార్య గిరిజతో పాటు సోదరుడు శ్రవణ్ కుమార్ పేరున కూడ సగం సగం ఆస్తిని రాసి వీలునామా రాయించాడు.

ఈ విషయాన్ని కూడ పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారంగానే మారుతీరావు ప్రణయ్ హత్య చేసేందుకు ప్లాన్ చేసుకొన్నాడని  ఈ వీలునామాను చూస్తే అర్థం అవుతోందని పోలీసులు అభిప్రాయపడ్డారు.