హైదరాబాద్: తన కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి  అతను ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

శనివారం రాత్రి మారుతీరావు హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల ఆర్యవైశ్య భవన్ లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ గదిలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు మిర్యాలగుడాలో ఎక్కువగా ఉండడం లేదని తెలుస్తోంది. ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటూ మిర్యాలగుడాకు వెళ్లి వస్తున్నట్లు సమాచారం. పని ఉంటే తప్ప ఆయన మిర్యాలగుడాకు వెళ్లడం లేదని అంటున్నారు. 

Also Read: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు: మారుతీరావు షెడ్డులో మృతదేహం

పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు మారుతీరావు భార్య పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మారుతీ రావు ఆత్మహత్య విషయం తనకు తెలియదని అమృత వర్షిణి ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. మారుతీరావు స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగుడా. వారం రోజుల క్రితం అతని ఇంటి నివాసంలోని షెడ్ లో ఓ గుర్తు తెలియని శవం లభించింది.

రెండేళ్ల క్రితం కిరాయి హంతకులతో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. ఈ కేసులో అతను బెయిల్ పై బయటకు వచ్చారు. తన ఆస్తి మొత్తం రాసిస్తానను, తనను కేసు నుంచి బయట పడేయాలని మారుతీరావు కూతురు అమృతను మారుతీరావు కోరినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఆమె అంగీకరించడం లేదు. మధ్యవర్తుల ద్వారా ఆయన కూతురిపై ఒత్తిడి పెడుతూ వస్తున్నాడు.

Also Read: ప్రణయ్ హత్య కేసు: అమృత ఫిర్యాదు, మరోసారి మారుతీ రావు అరెస్ట్

ఇదే క్రమంలో ఆయన షెడ్ లో మృతదేహం లభించడం, కేసు కష్టాల వంటి ఒత్తిళ్లకు అతను గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఆమె భర్త ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించాడు. ఈ సంఘటన అప్పట్లో మిర్యాలగుడాలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

తన తండ్రి నుంచి ప్రాణభయం ఉందని అమృత వర్షిణి మారుతీరావు బెయిల్ మీద విడుదలైన తర్వాత అమృత వర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అమృత వర్షిణి కుటుంబానికి పోలీసులు భద్రత కూడా కల్పించారు.