Praja Palana: ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు.. ఫోన్‌కు కాల్, మెస్సేజీ వచ్చిందా? జాగ్రత్త!

ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఫోన్ కాల్ చేసి ప్రజా పాలన దరఖాస్తుల వివరాలు ఆరా తీస్తూ ఓటీపీ అడిగి తీసుకుంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు నుంచి డబ్బులు మాయం అయ్యాయి.
 

praja palana applications verification cyber fraud asked for otp through phone calls kms

Cyber Crimes: సైబర్ మోసగాళ్లు నయా అవతారం ఎత్తారు. ఇప్పుడు ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలకులమని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు జరిగిన ప్రజా పాలనలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, దరఖాస్తుల దారుల వివరాలను ఆసరాగా చేసి మభ్యపెడుతున్నారు. వారి నుంచి ఓటీపీ స్వీకరించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

ఇప్పటి వరకు మెయిల్స్, మెసేజీలకు లింక్‌లు పంపి క్లిక్ చేయించడం, మెస్సేజీలతో తప్పుదారి పట్టించడం, బ్యాంకు అధికారులుగా ఫోన్లు చేసి ఓటీపీలు తీసుకుని సైబర్ నేరస్తులు డబ్బులు తస్కరించేవారు. కానీ, ఇప్పుడు ప్రజా పాలన కార్యక్రమంతో కొత్త మార్గంలో మోసానికి పాల్పడుతున్నారు. జనవరి 6వ తేదీతో ప్రజా పాలన కార్యక్రమం ముగిసింది.  ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను డీటీపీ ద్వారా డేటా బేస్‌లోకి ఎక్కిస్తామని ప్రభుత్వం చెప్పింది. సాధారణంగా ఎవరైనా తమ దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్నారని అనుకుంటారు. ఈ క్రమంలో ఏదైనా డౌట్ ఉంటే తమను సంప్రదించి సరి చేసుకుంటారనే ఆలోచనలోనూ ఉంటారు. ఈ ఆలోచననే సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. నిజామాబాద్‌లో తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

Also Read: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 11.14 క్వింటాళ్లు స్వాధీనం.. అందులో ఏం కలిపారంటే?

డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్యారంటీలకు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 8న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము దరఖాస్తు పరిశీలిస్తున్నామని, రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయని, సరి చేయకుంటే పథకాల కింద అర్హులు కాబోరని బెదిరించింది. తప్పులను సరిదిద్దాలంటే ఆమె ఫోన్‌కు వచ్చే ఓటీపీ వివరించాలని తెలిపింది. నిజమేనని నమ్మిన లావణ్య వచ్చిన ఓటీపీని చెప్పింది. వెంటనే ఆమె ఖాతా నుంచి రూ. 10 వేలు విత్ డ్రా చేసినట్టు మెస్సేజీ వచ్చింది. దీంతో ఆమె వెంటనే బ్యాంకు అధికారులను కలిసి చెప్పి ఖాతాలోని మిగిలిన డబ్బులను ఉపసంహరించుకుంది.

అదే నిజామాబాద్ జిల్లా గాయత్రినగర్‌కు చెందిన ఓ మహిళకు ఇలాగే ప్రజా పాలన దరఖాస్తు పరిశీలన పేరుతో వివరాలు చెప్పాలని అడిగింది. కానీ, సైబర్ మోసాలపై అవగాహన ఉన్న సదరు మహిళ ఫోన్ కట్ చేసింది. ఐదు నిమిషాల తర్వాతే మళ్లీ కాల్ చేసినా లిఫ్ట్  చేయలేదు. మరోసారి ఫోన్ రావడంతో నిలదీయగా ఫోన్ కట్ అయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజా పాలన పేరుతో ఫోన్ కాల్స్ వచ్చి ఓటీపీ అడిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios