Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో జయసుధ చేరికకు రంగం సిద్దం.. పోటీ చేసేది అక్కడి నుంచే..!!

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. వచ్చే వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

Popular telugu actor jayasudha likely to join BJP in presence of amit shah ksm
Author
First Published Jul 29, 2023, 4:54 PM IST

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈరోజు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డితో సమావేశమైన జయసుధ.. పలు అంశాలపై చర్చించారు. బీజేపీలో చేరికకు సంబంధించి కూడా కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ  క్రమంలోనే జయసుధ బీజేపీలో చేరికకు సంబంధించి రూట్ క్లియర్ అయింది. వచ్చే వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఏ తేదీన ఆమె బీజేపీలో చేరనున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జయసుధ.. బీజేపీలో చేరి ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, జయసుధ విషయాని వస్తే అనేక చిత్రాలలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలు పోషించారు. కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి  తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ విజయం సాధించలేకపోయారు. ఇక, జయసుధ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ చాలా వరకు ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ప్రస్తుతం జయసుధ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగానే ఉన్నారు. 

ఇక, జయసుధ బీజేపీలో చేరనున్నట్టుగా గతంలో కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  సమావేశమై ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె బీజేపీ ముందు కొన్ని ముందస్తు షరతులు పెట్టడంతో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నేతల ఆమోదం కోసం ఎదురుచూసినట్టుగా సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios