Asianet News TeluguAsianet News Telugu

వంద కోట్లు ఇస్తానని.. హుండీలో రూ.100 కూడా వేయలేదు, ఇది రామయ్యపై భక్తి : కేసీఆర్‌పై పొంగులేటి ఆగ్రహం

భద్రాచలం రాములోరికి కూడా కేసీఆర్ తప్పుడు వాగ్ధానం చేశారని మండిపడ్డారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భద్రాచలం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం కనీసం రూ.100 కూడా హుండీలో వేయలేదని ఆయన చురకలంటించారు. 

ponguleti srinivas reddy slams telangana cm kcr ksp
Author
First Published Mar 25, 2023, 4:52 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి భగ్గుమన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శనివారం భద్రాచలం నియోజకవర్గంలోని తన వర్గీయులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం కనీసం రూ.100 కూడా హుండీలో వేయలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి రాముల వారికి తలంబ్రాలు తీసుకొచ్చారని.. రాముడు మీద కేసీఆర్‌కు వున్న గౌరవం అది అంటూ శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోడు భూముల్లో గిరిజనులకు ఒక్క ఎకరం కూడా పట్టా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గుర్తుకొస్తాయన్నారు.

కొందరి స్వార్థం వల్ల పోటీ పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. విద్యార్ధులకు అన్యాయం జరిగినా కమీషన్ సభ్యులను ఎందుకు బర్తరఫ్ చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. మంత్రుల పీఏలు, కొందరు అధికారులపైనా ఆరోపణలు వచ్చాయని.. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు లక్ష చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్‌తో కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఏదైనా సరే.. కేసీఆర్ గద్దె దించడమే తన లక్ష్యమని.. త్వరలోనే ఏ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అభిమానుల కోరిక మేరకే నిర్ణయం వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ALso Read: అప్పుల కుప్ప చేశారు: కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్

ఇదిలావుండగా.. ఈ నెల ప్రారంభంలో పాలేరులో పొంగులేటి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని  చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని  సీఎం కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కీలకంగా  వ్యవహరించాయన్నారు.  కానీ ఈ రెండు పార్టీలను కాదని  టీఆర్ఎస్ ను రెండు దఫాలు ప్రజలు రాష్ట్రంలో గెలిపించినట్టుగా  చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆాకాంక్షలకు అనుగుణంగా  కేసీఆర్ పాలన చేస్తాడని భావించి  ప్రజలు  టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ కేసీఆర్ మాత్రం  ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా  పాలన సాగిస్తున్నాడని  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. రూ. 5 లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేశాడని  పొంగులేటి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios