హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (పోతిరెడ్డిపాడు) పైనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి.రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణలోని విపక్షాలు కేసీఆర్ సర్కార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆగష్టు 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగష్టు 20వ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశాడు. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మకైందని విపక్షాలు ఆరోపణలు చేశాయి. పోతిరెడ్డిపాడును అడ్డుకొనేందుకు విపక్షాలు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాయి.

also read:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో లేనిపోని గొడవలు: జగన్ పై బాబు

తెలంగాణ సీఎం నీటి పారుదల రంగంపై సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనవసరంగా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేసిందని కేసీఆర్ విమర్శించారు. జగన్ కు అన్నం పెట్టి చర్చించాను, కానీ, గిచ్చి కయ్యం పెట్టుకొంటున్నాడని జగన్ పై కేసీఆర్ ఫైర్ అయ్యాడు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణలో మాదిరిగా ఏపీలో విపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణలో విపక్షాలు పోతిరెడ్డిపాడుపై ఏకతాటిపై ఉన్నాయన్నారు. కానీ ఏపీలో మాత్రం పోతిరెడ్డిపాడుపై  టీడీపీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించింది వైసీపీ.

ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడ ఏపీ సీఎంపై ఫైరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ లేనిపోని గొడవలు తీసుకొచ్చాడని బాబు జగన్ పై మండిపడ్డారు. 

మరో వైపు తమ వాటా నీటిని వాడుకొంటున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడ తమ వాటా ప్రకారంగానే నీటిని వాడుకొంటామని చెబుతోంది. నీటి వాటాల విషయంలో మొదటి నుండి తెలంగాణకు అన్యాయం జరిగిందని  తెలంగాణ చెబుతోంది.అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.