Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం
డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు నిధులు ఇంకా పంపిణీ చేయడం లేదని, ఎప్పుడు డబ్బులు వేస్తారని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ప్రస్తావించి నిలదీశారు. హరీశ్ రావు ప్రశ్నలపై మంత్రి సీతక్క స్పందించారు.
హైదరాబాద్: రైతు బంధు, రుణ మాఫీ వంటి అంశాలు తెలంగాణలో చాలా తీవ్రత కలిగినవి. రైతు బంధు ఠంచన్‌గా పెట్టుబడిగా రైతులకు అందాల్సిందే. లేదంటే ప్రజాగ్రహానికి లోనుకాక తప్పని పరిస్థితి. ఈ అంశాన్ని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లేవనెత్తింది. ప్రభుత్వంపై మెల్లిగా అటాక్ ప్రారంభించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు నిధులు పడతాయని రేవంత్ రెడ్డి క్యాంపెయిన్‌లో భాగంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ. 10 వేలే వస్తున్నాయని, తాము రూ. 15 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెర మీదికి వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు వేస్తామని రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చి ఉన్నారని, ఈ రోజు 9వ తేదీ అయినా ఇంకా డబ్బులు వేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.
హరీశ్ రావు ప్రశ్నలపై మంత్రి సీతక్క స్పందించారు. గత ప్రభుత్వం ఇష్టారీతన నిర్ణయాలు తీసుకుందని, ఇష్టమున్నట్టుగా నిబంధనలు రాసుకుందని విమర్శించారు. అందుకే అప్పుడు రైతు బంధు నిధులు మంత్రులకు లక్షల్లో వెళ్లడాన్ని చూశామని అన్నారు. అందుకే రైతు బంధుకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారని, ఆ తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు.
Also Read: TTDP: ఆగ్రహంలో తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటీ?
రైతు బంధు పై సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సమీక్ష చేస్తారు? ఎప్పుడు వేస్తారు? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దూకుడుగా పని చేస్తున్నది. ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమల్లోకి తెచ్చింది.
తెలంగాణ ఎన్నికలకు ముందు రైతు బంధు డబ్బులు వేయరాదని, అవి ఓటర్లను ప్రభావితం చేస్తాయని ఫిర్యాదు అందడంతో ఎన్నికల సంఘం రైతు బంధు డబ్బుల పంపిణీకి చెక్ పెట్టిన సంగతి తెలిసిందే.