సూర్యాపేట: రాజకీయాల కోసం కన్న కొడుకునే హతమార్చాడో కసాయి తండ్రి. తనను కాదని వేరే రాజకీయ పార్టీలో కొనసాగడమే కాకుండా తనకు పోటీగా పంచాయితీలు నిర్వహించడం ఆ తండ్రికి నచ్చలేదు. రాజకీయంగా కన్న కొడుకు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన  తండ్రి మమకారాన్ని మరిచి కొడుకుపై అతి దారుణంగా దాడిచేసి హతమార్చాడు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

సూర్యాపేటకు చెందిన ఈదప్ప కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అతడి కొడుకు శ్రీశైలం మాత్రం తండ్రి కొనసాగుతున్న పార్టీలో కంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరితే రాజకీయంగా ఎదుగుదల వుంటుందని అందులో చేరాడు. ఇలా తండ్రీ కొడుకులిద్దరు వేరు వేరు పార్టీల్లో కొనసాగుతుండటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 

read more   నగరంలో ముగ్గురు మహిళలు అదృశ్యం

అయితే ఇటీవల ఓ భార్యాభర్తల మధ్య పంచాయతీ విషయంలో చెరో వైపు నుంచి పెద్దమనుషులుగా తండ్రీకొడుకులు వ్యవహరించారు. దీంత కొడుకు తనకు పోటీగా పంచాయితీలో పాల్గొనడం తండ్రి ఈదప్పకు నచ్చలేదు. దీంతో కొడుకుపై కోపాన్ని పెంచుకుని దారుణానికి పాల్పడ్డాడు. 

మంగళవారం రెవెన్యూ చట్టం సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఈదప్ప కోపంతో ఊగిపోయాడు. ఈ సమయంలోనే తండ్రీ కొడుకుల మద్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఈదప్ప కొడుకు శ్రీశైలం తలపై కర్రతో బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే  మృతి చెందాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.