హైదరాబాద్ నగరంలో మహిళలు వరసగా అదృశ్యమౌతున్నారు. గడిచిన మూడు రోజుల్లో వరసగా ముగ్గురు మహిళలు కనిపించకుండా పోయారు. కాగా.. ఈ సంఘటన ప్రస్తుతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈనెల 19 నుంచి 21 వరకు వరుసగా మూడు రోజులు ఒక్కొక్కరుగా అదృశ్యమయ్యారని దుండిగల్ సీఐ వెంకటేష్ తెలిపారు.

దుండిగల్‌లో నివాసం ఉండే 22ఏళ్ల శిరీష ఈనెల 19న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో శిరీష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే ఉద్యోగి భారతి (21) ఈనెల 20న కొంపల్లిలోని ఆఫీసుకని బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తండ్రి పైడితల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బహుదూర్ పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే 38 ఏళ్ల పద్మావతి భర్తతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. దీంతో తన భార్య ఆచూకీ తెలియలేదంటూ భర్త లక్ష్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన ఈ ముగ్గురు కోసం  పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.