తెలంగాణ కాంగ్రెస్ కు డబ్బులిచ్చేందుకు బెంగళూరు బిల్డర్లకు ‘రాజకీయ ఎన్నికల పన్ను’- కేటీఆర్
ఎన్ని డబ్బులు గుమ్మరించినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నకు నిధులు సమకూర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూరులోని బిల్డర్ల దగ్గర నుంచి దీని కోసం ట్యాక్స్ వసూలు చేస్తోందని అన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందులో హోరా హోరీగా తలపడేందుకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు బిల్డర్ల నుంచి పన్ను వసూలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
200 మంది మహిళల ఫొటోలు తీసి, అశ్లీలంగా మార్చిన ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉద్యోగి.. తరువాత ఏం జరిగిందంటే ?
గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇంకా తన పద్దతిని మార్చుకోలేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఆ పార్టీని కాంగ్రెస్ అని కాకుండా ‘స్కాంగ్రెస్’ అని అంటారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చరిత్ర స్కామ్స్ కు ప్రసిద్ధి చెందిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ఎన్ని డబ్బులు గుమ్మరించినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు.
‘‘కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ కు నిధులు సమకూర్చేందుకు బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500 చొప్పున 'రాజకీయ ఎన్నికల పన్ను' విధించడం ప్రారంభించింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ, గొప్పదైన దాని వారసత్వం స్కామ్స్ కు ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి ‘స్కాంగ్రెస్’ అని పేరు పెట్టారు. వారు (కాంగ్రెస్) ఎంత డబ్బు కుమ్మరించినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు.. తెలంగాణలో స్కాంగ్రెస్ వద్దని చెప్పండి’’ అని ఆయన పేర్కొన్నారు.