ఓ వ్యక్తి అనుకోకుండా హత్యకు గురయ్యాడు. అతనిని ఎవరు చంపారు..? ఎందుకు చంపారో కూడా ఎవరికీ తెలీదు.. ఎలాంటి క్లూస్ కూడా దొరకుండా జాగ్రత్తపడ్డారు. ఈ కేసు అంతటితో ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ చివరకు ఆ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ కేసుకు సంబంధించిన క్లూ ని పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకోగా...ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ హత్యాయత్నం కేసును విచారిస్తుండగా.. పోలీసులకు రెండున్నరేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘటన బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం...  ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ భస్యుడు మండలి రాముపై ఈ నెల 3న రాజకీయ కక్షతో హత్యాయత్నం జరిగింది.

వీరిలో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకోగా.. వారిలో ఒకరు 2018లో అదృశ్యమైన దైదా విజయ్ కుమార్(24) అలియాస్ శివ అనే యువకుడి కేసు గురించి చెప్పడంతో మొత్తం బయటపడింది. అప్పుడు జరిగింది.. విజయ్ కుమార్ అదృశ్యం కాదని.. హత్య అని తేలింది.

సింగరేణి విశ్రాంత ఉద్యోగి కుమారుడు అయిన విజయ్ కుమార్ కు ఐదుగురు తోబుట్టవులున్నారు. పెద్దగా చదువుకోలేదు. చిల్లర గ్యాంగ్ తో తిరిగేవాడు. అప్పట్లో చాలా కేసుల్లో తల దూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ గొడవల నేపథ్యంలో ప్రత్యర్థులు రాజ్ కమల్, తంబల్ల కమల్, బాబు రాజ్ పాసి మరో ముగ్గురితో కలిసి విజయ్ కుమార్ హత్యకు ప్లాన్ వేశారు. 2018 సెప్టెంబర్ 9న సాయంత్రం ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అతను ఒంటరిగా దొరకడంతో క్రికెట్ బ్యాట్ తో మూకుమ్ముడిగా దాడి చేశారు. దీంతో ఆ యువకుడు మృతి చెందాడు.

అప్పటికే చీకటి పడటంతో దగ్గర్లోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టేశారు. కుటుంబసభ్యులు విజయ్ కనిపించడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తీరా రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.