కొండాపూర్ గాయత్రి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా యువతిపై అత్యాచారం చేసిన వీడియోను గాయత్రి తన ల్యాప్‌టాప్, మొబైల్‌లో సేవ్ చేసింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు.  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ కొండాపూర్ (kondapur) గాయత్రి (gayatri) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోన్న యువతిపై దుండగులు అత్యాచారం, దాడి చేశారు. యువతిపై అఘాయిత్యం చేస్తుండగా గాయత్రి ఈ దారుణాన్ని వీడియో తీసింది. అనంతరం ఆ వీడియోను తన ల్యాప్‌టాప్, మొబైల్‌లో సేవ్ చేసింది. దర్యాప్తులో భాగంగా ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసిన పోలీసులు వాటిని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు (forensic science laboratory) తరలించారు. 

అలాగే ఈ కేసులో గాయత్రి భర్త శ్రీకాంత్ వ్యవహారంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్ ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లైంగిక దాడికి గురైన బాధితురాలే పీఎస్‌కి వచ్చి ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. 24 గంటల్లో గాయత్రి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం వున్నా వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. 

కాగా.. కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన దంపతులు రత్నరాజు, కృష్ణవేణి. కూతుళ్లు సౌజన్య, గాయత్రి, కుమారుడు ప్రదీప్ రాజు. సైన్యంలో పనిచేసిన రత్నరాజు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. చిన్న కూతురు గాయత్రి 2009లో ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరంగా వెళ్ళింది. ఆ తరువాత భర్త నుంచి విడిపోయిన ఆమె శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆస్తి పంపకాలలో తలెత్తిన గొడవలతో రత్న రాజు, కృష్ణవేణి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తనను వేధిస్తున్నాడంటూ భర్తపై కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీ రామ్ నగర్ కాలనీ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 215 పార్ట్, 216, 217, 218, 229, 230 పార్ట్ లోని ఇంట్లో గాయత్రి తన భర్త శ్రీకాంత్ తో గత కొంత కాలంగా నివాసముంటుంది. రత్నరాజు చిన్న కూతురు దగ్గర ఉంటున్నాడు. 2015లో రత్నరాజు మరణించాక గొడవలు మరింత ముదిరాయి. గాయత్రి ఉన్న ఫ్లాట్ లోకి కృష్ణవేణి, సౌజన్య అక్రమంగా ప్రవేశించారంటూ గతంలో కేసు నమోదైంది. కుటుంబంలో తగాదాలు జరుగుతున్న సమయంలోనే సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీకాంత్ కు ఆంధ్రాకు చెందిన యువతి దగ్గరైంది.

ALso Read:కొండాపూర్ గాయత్రి కేసులో ట్విస్ట్ : ఆస్తికొట్టేయాలని ఆమె తల్లి, సోదరి స్కెచ్.. మీడియాతో శ్రీకాంత్

భర్త ఆ యువతితో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని గాయత్రీ ఐదుగురు యువకులను లైంగిక దాడికి పురిగొల్పింది. ఆ కేసులో గాయత్రి జైలుకు వెళ్లడంతో.. తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య, సోదరుడు ప్రదీప్ రాజు, బాబాయ్ మల్లికార్జున్ ఆదివారం కొండాపూర్లోని శ్రీరాంనగర్ లోని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. శ్రీకాంత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్లాట్, దుకాణాల్లోకి అక్రమంగా ప్రవేశించిన విషయంలో సౌజన్యపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. 

అసలేం జరిగిందంటే…
గాయత్రి కొండాపూర్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి భాగస్వామి శ్రీకాంత్ సివిల్ కోచింగ్ సమయంలో బాధితురాలిని కలిశాడు. గాయత్రి తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో ఆమెతో కలిసి ఉండాల్సిందిగా బాధితురాలిని కోరాడు. బాధితురాలు అక్టోబర్ 2021 నుంచి ఫిబ్రవరి 22వరకు గాయత్రితో పాటు వెళ్ళింది.

అయితే, శ్రీకాంత్, బాధితురాలి మధ్య సంబంధం ఉందని అనుమానించింది. ప్రణాళిక ప్రకారం ఐదుగురు వ్యక్తులను గాయత్రి ఇంట్లోని బాధితురాలి వద్దకు తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారం చేయించి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.