వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని.. చాకచక్యంగా కాపాడిన పోలీసులు...(వీడియో)
మంగళవారం సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి పారుతున వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు కాపాడారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. భారీ వర్షాల వల్ల మంగళవారం, హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. దీంతో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే సాయంత్రం సుమారు 4:45 గంటల సమయంలో ఓ వ్యక్తి బైక్‌పైకలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు.దీంతో వరదల్లో చిక్కుకుపోయాడు. ముందుకు కదలలేక ఇబ్బంది పడ్డాడు.
హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నాయి. దీంతో వరద నీరు ప్రవహించే రోడ్డుపైకి ప్రవేశించి.. దాటొచ్చుఅనుకుని రోడ్డులోకి ప్రవేశించాడు. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా వరద ఉధృతిని బండి బ్యాలెన్స్ తప్పి.. కొట్టుకుపోతున్నాడు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం ఇది గమనించింది. దీంతో నీటిలో కొట్టుకుపోతున్న బాధితుడిని భయపడొద్దని చెప్పి.. మొదట తాడుతో అతడిని కొట్టుకుపోకుండా చేసి.. ఆ తరువాత ఇనుప సంకెళ్లతో బండిని బిగించమని సూచనలు చేసి.. అతడిని, బండిని వరదల నుంచి కాపాడారు.
తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం కృషిని సైబరాబాద్ పోలీసు కమిషనర్స్టీఫెన్ రవీంద్ర, ఐపీస్, అభినందించారు.
కాగా, శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాల గేట్లను పెద్దఎత్తున ఇన్ ఫ్లో రావడంతో శనివారం అధికారులు ఈ గేట్లను బలవంతంగా తెరిచారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ నగరంలో ప్రవహించే మూసీ నదిలోకి వరద నీటిని వదిలేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు రెండు గేట్లను తెరిచింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్ సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) 1790 అడుగులకు గాను 1,786.65 అడుగులకు చేరుకుంది.
పొంగిపొర్లుతున్న మూసీ.. మూసారాంబాగ్- అంబర్ పేట్ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత
పరివాహక ప్రాంతంలో కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయానికి 2 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. బోర్డు రెండు గేట్లను తెరిచి 1,248 క్యూసెక్కులు విడుదల చేసింది. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులు కాగా ఎఫ్‌టిఎల్ 1763.50 అడుగులు. జలాశయానికి 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు అధికారులు రెండు గేట్లను తెరిచారు.
రెండు రిజర్వాయర్లకు మరింత ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉన్నందున మూసీ నది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు నల్గొండ జిల్లా అనంతారం వద్ద మూసీ నది 230.5 మీటర్ల నీటిమట్టానికి చేరుకుని తీవ్ర వరద పరిస్థితిని ఎదుర్కొంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.