తెలంగాణ సర్కారు ఉద్యోగాల భర్తీ వేగాన్ని పెంచింది. ఇప్పటికే హోం శాఖ పరిధిలోనే ఎక్కువ మొత్తంలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది ప్రభుత్వం. అయితే తాజాగా మళ్లీ  అదే శాఖలో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసుకోడానికి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కు తెలంగాణ సర్కారు  అనుమతిచ్చింది. అయితే ఇంతకు ముందుకంటే ఎక్కువగా ఈ సారి భారీ మొత్తంలో అంటే14, 177 పోస్టుల భర్తీకి అనుమతించింది ప్రభుత్వం. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగాలపై ఆశలు మరోసారి చిగురించాయి.

 ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వున్న పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో 1210 ఎస్సై పోస్టులు, ఎస్సై సివిల్‌ 710, ఎస్సై ఏఆర్ 275, ఎస్సై టీఎస్‌ఎస్పీ 175 పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే ఫింగర్‌ప్రింట్స్‌ బ్యూరోలో 26 ఏఎస్సై పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
 ఇక కానిస్టేబుల్ ఉద్యోగాల విషయానికి వస్తే మొత్తం  12,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో  కానిస్టేబుల్‌(సివిల్) 5002, కానిస్టేబుల్ ‌(ఏఆర్‌) 2283, కానిస్టేబుల్ ‌(టీఎస్‌ఎస్పీ) 4816 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.