సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వెంకటేశ్ వేధింపులతో పాటు మరో మహిళ వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆఫీసులో తనతో పాటు పనిచేసే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటాన్ని తట్టుకోలేకే లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి అతను విదేశాల్లో తిరిగేవాడని వెల్లడైంది.

Also Read:టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు: భర్త ఇతనే, అరెస్ట్

ఫ్లైట్ టికెట్‌లు, వాట్సాప్ ఛాటింగ్, లైవ్ ఛాటింగ్‌లో వీరిద్దరి అక్రమ సంబంధాన్ని లహరి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీని గురించి భర్తను నిలదీసింది. గుట్టు తెలిసిపోవడంతో ఇక భార్య ముందే లైవ్‌లో ఆ యువతితో సరస సంభాషణలు మొదలుపెట్టాడు.

ఇవన్నీ చూసి లావణ్య సహించలేకపోయింది. అంతేకాకుండా ఆ యువతికి ఫోన్ చేసి తనకు అన్యాయం చేయొద్దని వేడుకుంది. కానీ తాను వెంకటేశ్‌తో సంబంధం కొనసాగిస్తానంటూ ఆ యువతి తెగేసి చెప్పేసింది.

Also Read:టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు: పరారీలో అత్తామామలు, అసలేం జరిగింది?

ఈ విషయం ఆమె భర్తకి తెలియడంతో అతను రెచ్చిపోయాడు. గత కొంతకాలంగా లహరిపై భౌతికదాడులకు తెగబడ్డాడు. మానసికంగా, శారీరకంగా లహరిని హింసించేవాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

మరోవైపు తమ కూతురిని వెంకటేశ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని వాపోయారు. అతని పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.