Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  హైదరాబాద్‌లోని ఆయన నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. 

Police House Arrest TPCC Chief Revanth Reddy ksm
Author
First Published Mar 24, 2023, 10:02 AM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్‌ వద్ద ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు(మార్చి 24, 25 తేదీల్లో) నిరుద్యోగ మహాదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ దీక్షకు హాజరై సంఘీభావం తెలుపనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ మహాదీక్షకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు రేవంత్ ఇంటివైపు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లకుండా చూస్తున్నారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇప్పటికే నిరుద్యోగ దీక్షకు అనుమతి  లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచే విద్యార్థులను ముందస్తుగా  అరెస్ట్‌లు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజ్‌తో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు విద్యార్థి జేఏసీ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగ మహాదీక్ష నిర్వహించి తీరుతామని చెబుతుంది. 

ఇదిలా ఉంటే.. ఆర్ట్స్ కాలేజీ వద్ద రెండు రోజులపాటు నిరుద్యోగ మహాదీక్షను నిర్వహించనున్నట్టుగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యార్థుల జేఏసీ, నిరుద్యోగ యువజన సంఘం తెలిపాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్‌తో సహా బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల రద్దు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు రూ. లక్ష పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రేవంత్‌రెడ్డి ఓయూ క్యాంపస్‌కు వస్తారని విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios