మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అమానుష ఘటన నిజామాబాద్ లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెడితే.. నిజామాబాద్‌ జిల్లా, నాగిరెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆమెను లోబర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భవతైంది. ఇటీవలే ప్రసవించింది.  

బాలిక ప్రసవించిన తరువాత కానీ విషయం వెలుగులోకి రాలేదు. ఆ బాలిక తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో వరుసకు అక్క అయిన మహిళనే సంరక్షణ బాధ్యత చూస్తోంది. అయితే బాలిక గర్భవతి అని తెలియగానే, దీనికి కారణమైన యువకుడిని అక్క నిలదీసింది. అయితే యువకుడు వారికి మాయ మాటలు చెబుతూ వచ్చాడు. 

అయితే బాలిక ప్రసవించడంతో విషయం బంధువులకు, చుట్టుపక్కల వారికీ తెలిసింది. దీంతో వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు.