Asianet News TeluguAsianet News Telugu

బికునూరులో కోదండరాం నిర్బంధం

  • జెఎసి స్పూర్తి యాత్రకు సర్కారు బ్రేక్
  • బిక్నూరు వద్ద కోదండరాం నిర్బందం
  • అనుమతిలేదంటున్న పోలీసులు
  • యాత్ర జరిపి తీరుతానన్న కోదండారం
  • పూటకో మాట చెబుతున్న పోలీసులు
  • శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించిన సర్కార్
  • స్పూర్తి యాత్ర జైత్రయాత్రగా మారుతుందన్న గుబులు
Police detention kodandaram at bhiknur

కోదండరాం స్పూర్తియాత్రకు తెలంగాణ సర్కారు బ్రేక్ వేసింది. మూడు దశల్లో అమరుల స్పూర్తియాత్రను జైత్రయాత్రగా చేపట్టిన కోదండంపై గులాబీ సర్కారు గురి పెట్టింది. కుటంబసభ్యులను టార్గెట్ చేసి యాత్ర చేపట్టిన కోదండరాం ను ఇక ఉపేక్షించేదిలేదని సర్కారు పెద్దలు కన్నెర్రజేసిర్రు. అంతే... నిజామాబాద్ జిల్లాలో క్షణాల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. కోదండరాం ను నిర్బంధించడం కూడా జరిగిపోయింది. ఇక ఇటు పోలీసులు అటు గులాబీ నేతలు సాకులు వెతికే పనిలో పడ్డరు. బికునూరు పోలీసు స్టేషన్ లో కోదండరాం తోపాటు జెఎసి యాత్రకు వెళ్తున్నవారందరినీ తమ నిర్బంధంలో ఉంచిర్రు పోలీసులు. వారందరికీ మధ్యాహ్న భోజనం కూడా పోలీసులే తెప్పించి పెట్టిర్రు. పైనుంచి ఆదేశాలొచ్చే వరకు సార్ ను ఇక్కడి నుంచి కదలనిచ్చే సవాల్ లేదంటున్నరు బిక్నూరు పోలీసులు.

అమరుల స్పూర్తి యాత్రలు తెలంగాణ సర్కారుకు పంటి కింద రాయిలా, కంట్లో దుమ్ములా మారాయి. ఆయన తొలుత అల్లుడు హరీష్ రావు ఇలాకాలో యాత్ర చేపట్టారు. అక్కడ జనాల్లో భారీగానే స్పందన వచ్చింది. తర్వాత వెంటనే కొడుకు కోటలో కాలు పెట్టిండు. సిరిసిల్ల యాత్ర కూడా బాగానే జరిగింది. ముచ్చటగా మూడో దశ యాత్రను ఏకంగా గులాబీ దళపతి ఫామ్ హౌజ్ పైనే గురి పెట్టిండు. గజ్వెల్ లోనూ స్పూర్తి యాత్ర జైత్రయాత్రగానే సాగింది.

నాలుగో దశ యాత్ర కూతురు కవితమ్మ ఇలాకాలో ప్లాన్ చేసింది జెఎసి. ఇక ఈ యాత్రకు బ్రేక్ వేయకపోతే మంచిగ లేనట్లుందని సర్కారు తలంచింది. దీంతో యాత్రకు అడ్డంకులు షురూ అయ్యాయి. క్షణాల్లో సీన్ మారిపోయింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమై కూసుంది. దీంతో కోదండరాంను కదలనియ్యబోమని పోలీసులు కచ్చెకు కాలు దువ్వుతున్నరు.

ఉదయం గన్ పార్కు వద్ద ఎప్పటితాగే యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కామారెడ్డి, నిజామాబాద్ లలో యాత్ర రెండు రోజులపాటు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి ర్యాలీ బయలుదేరింది. తొలుత బస్వాపూర్ లో జెఎసి ర్యాలీ, సభ జరిపింది. కోదండరాం ఆ సభలో మాట్లాడారు. సభ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బిక్నూరు వెళ్లారు. బిక్నూరులో ఇక వ్యవహారం షురూ అయింది. బిక్నూరులో సభ ఏర్పాట్లలో ఉండగా కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. కొద్దిసేపు టిఆర్ఎస్ కార్యకర్తలకు, జెఎసి ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టిఆర్ఎస్ వారిని అక్కడి నుంచి పంపించారు. తర్వత బిక్నూరులో సభ ముగిసింది. దీంతో అక్కడి నుంచి కామారెడ్డి వెళ్లేందుకు జెఎసి నేతలు సిద్ధమయ్యారు. పోలీసులు అనుమతించలేదు. వాహనాలు ఎక్కువగా ఉన్నాయి కాన్వాయికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తమను అనుమతించాలంటూ ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లారు కోదండరాం. దీంతో ఆయన బయటికొస్తున్న సమయంలోనే అనుమతి లేదంటూ పోలీసు స్టేషన్ లోనే నిర్బందించిర్రు.

ఇక ఏకకాలంలో కామారెడ్డిలో ఇంకో సీన్ జరిగింది. గులాబీ శ్రేణులు కామారెడ్డిలో ప్రతాపం చూపిర్రు... రెచ్చిపోయిర్రు. మరి కాసేపట్లో జెఎసి స్పూర్తియాత్ర కామారెడ్డిలోకి వస్తుందన్న ఉద్దేశంతో అక్కడ జెఎసి యువత, విద్యార్థులు సభా ప్రాంగణం ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నరు. ఇంతలో గులాబీ దండు దాడికి తెగబడ్డది. అక్కడ ఉన్న జెఎసి నాయకులు, విద్యార్థులపై దాడి చేయడంతోపాటు సభా ప్రాంగణం అంతా చిందరవందర చేసిర్రు. టెంట్లు ఊడపీకేసి, కుర్చీలు వరగొట్టి పడేశిర్రు. ఆ సమయంలో ముగ్గురు జెఎసి విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇక నాలుగో విడత యాత్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో శాంతిభద్రతల సమస్య నెలకొన్న దృష్ట్యా యాత్రకు అనుమతి లేదని చెబుతున్నారు. మరోవైపు తాము ఒక వైపు నుంచి అనుమతిస్తే యాత్ర ఇంకోవైపు నుంచి చేపడుతున్నారని చెబుతున్నారు. దీనికితోడు వాహనాల సంఖ్య ఎక్కువగా ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. రకరకాల కారణాలు చూపుతూ పోలీసులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జెఎసి నేతలు మధ్యాహ్న భోజన పథకం పోలీసు స్టేషన్ లోనే జరిపి యాత్రను అడ్డుకుంటే ఇక్కడే తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డరు.

చూడాలి రాత్రి వరకు నాలుగో విడత యాత్రపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి?

Follow Us:
Download App:
  • android
  • ios