Asianet News TeluguAsianet News Telugu

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసు.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏసీబీ కోర్టుకు తరలింపు..

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసులో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

police detain all three accused in Moinabad farm house case after high court orders
Author
First Published Oct 29, 2022, 3:22 PM IST

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసులో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కాసేపటి క్రితం నిందితులను రిమాండ్‌కు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు.. షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి  వారిని మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు. అనంతరం వారిని జైలుకు తరలించనున్నారు. నిందితుల తరలింపుకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

అయితే నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు.. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ జరిపిన హైకోర్టులోని మరో బెంచ్.. పోలీసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేవరకు స్టే విధించింది. బీజేపీ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నిందితుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనను పోలీసులు విరమించుకున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసు: నిందితులకు హైకోర్టు షాక్, లొంగిపోవాల్సిందే

ఇక, ఈ కేసులో నిందితుల రిమాండ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios