సినీ నటుడు నాగబాబుపై మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణవాది ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. గాడ్సేను సమ ర్ధిస్తూ, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీజీనీ, గాంధేయ వాదాన్ని వక్రీకరిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నాగబాబు పోస్టులు ఉన్నాయని,  చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా.. కొద్ది రోజుల క్రితం నాగబాబు.. సోషల్ మీడియాలో మహాత్మాగాంధీని విమర్శిస్తూ.. గాడ్సేని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

‘‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

అంతకముందు "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable.కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు" అని నాగబాబు అన్నారు

."కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అని అన్నారు.

నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల నేపథ్యంలోనే నాగబాబుపై వరంగల్ లో కేసు నమోదైంది.