మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యాభర్తలైన ఇద్దరు అభ్యర్ధులు ఒకేసారి గ్రూప్ 4 పరీక్ష రాయడానికి వచ్చారు. అయితే వీరి 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు

పోలీసులంటే కరకుతనంతో వుంటారని, ఏమాత్రం జాలి , దయ వుండవని జనం అనకుంటారు. కానీ అది నిజం కాదని.. మానవత్వం విషయంలో తాము ఎవ్వరికి తక్కువ కాదని రుజువు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో గ్రూప్ 4 పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో రెండు సెషన్‌లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని టీఎస్‌పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 

ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యాభర్తలైన ఇద్దరు అభ్యర్ధులు ఒకేసారి గ్రూప్ 4 పరీక్ష రాయడానికి వచ్చారు. అయితే వీరికి 3 నెలల చిన్నారి వుండటంతో పాపను బయట విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు చిన్నారిని లాలించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులు గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యారు. మూడు నెలల పాప, జగ్గులాల్ తల్లితో కలిసి దంపతులిద్దరూ పరీక్షా కేంద్రానికి వచ్చారు. 

ఈ నేపథ్యంలో పాపను నానమ్మ దగ్గర వదిలేసి వీరిద్దరూ లోపలికి వెళ్లారు. అయితే ఆ కాసేపటికే చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని తీసుకుని లాలించారు. ఆపై మంచం తెప్పించి పడుకోబెట్టారు. తొర్రూరులోని పది పరీక్షా కేంద్రాలకు ఇలాగే చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు హాజరయ్యారు. పలు పరీక్షా కేంద్రాల్లో చిన్నారులకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తూ మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.