స్వతంత్ర దినోత్సవం రోజే అమానుషం... అర్ధరాత్రి స్టేషన్ లో పెట్టి మహిళపై పోలీసుల దాష్టికం (వీడియో)
కూతురు పెళ్లి పనులకోసం బయటకు వచ్చిన మహిళను పట్టుకుని పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన అమానుషం హైదరాబాద్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్ : అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా రోడ్డుపై తిరగగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. కానీ ఆ రోజు వచ్చేలా కనిపించడం లేదు. ఐటీ నగరం హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వచ్చిన మహిళపై పోలీసులే రాక్షసంగా ప్రవర్తించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే పెట్టి చిత్రహింసలకు గురిచేసారు. స్వాంతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది. ఈమె కూతురు పూజకు తిరుమలగిరికి చెందిన కుమార్ నాయక్ తో పెళ్ళి కుదిరింది. ఈ నెల 30న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా పెళ్లిపనులు చూసుకుంటోంది లక్ష్మి.
ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూతురు పెళ్లికి డబ్బులకోసం సరూర్ నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది లక్ష్మి. డబ్బులు తీసుకుని రాత్రి ఒంటరిగా ఇంటికి బయలుదేరిన ఆమెను ఎల్బీ నగర్ సర్కిల్ లో పోలీసులు ఆపారు. కారణం చెప్పకుండానే తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా స్టేషన్ లోనే వుంచి చిత్రహింసలకు గురిచేసారు. , బూతులు తిడుతూ లాఠీలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధితురాలు చెబుతోంది.
వీడియో
లక్ష్మిని రాత్రంతా స్టేషన్ లోనే వుంచి చితకబాదిన పోలీసులు ఉదయం విడిచిపెట్టారు. పోలీసుల దెబ్బలతో నడవలేని స్థితిలో ఆమె ఎలాగోలా ఇంటికి చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం బయటపెడితే నీ సంగతి చూస్తామని బెదిరించడంతో భయపడిపోయిన లక్ష్మి విషయం బయటపెట్టలేదు. కానీ కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడంతో కాస్త ఆలస్యమైనా పోలీసుల దాష్టికాన్ని బయటపెట్టింది.
Read More పోలీస్ అవతారం, అత్యాధునిక కార్లలో గంజాయి సరఫరా: ముఠా గుట్టు రట్టు చేసిన హైద్రాబాద్ పోలీసులు
పోలీస్ దెబ్బలతో లక్ష్మి కాళ్లు నల్లగా కమిలిపోయాయి. శరీరంపై అనేక చోట్ల గాయాలున్నట్లు తెలిపారు. పోలీసులు తనతో చాలా అవమానకరంగా ప్రవర్తించారని... ఎక్కడపడితే అక్కడ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళను రాత్రి పోలీస్ స్టేషన్ లో వుంచడమే తప్పయితే... ఆమెపై థర్డ్ డిగ్రీ కూడా ప్రదర్శించిన ఎల్బీ నగర్ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.