Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ అధికారుల కిడ్నాప్ : నిందితులు అరెస్ట్ .. డీజీపీ, సీపీకి నిర్మలమ్మ ఫోన్.. కఠిన చర్యలకు ఆదేశం

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, సీపీతో మాట్లాడారు

police arrests 4 members gang in gst officers kidnapp case ksp
Author
First Published Jul 5, 2023, 4:40 PM IST

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన వారిని దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. మరోవైపు జీఎస్టీ అధికారుల కిడ్నాప్ విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, సీపీతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే :

జీఎస్టీ కేసులకు సంబంధించి మణిశర్మ, ఆనంద్ అనే సీనియర్ అధికారులు ఇవాళ కృష్ణానగర్ ప్రాంతంలోని స్క్రాప్, వెల్డింగ్ షాప్ తనిఖీలకు వెళ్లారు. ఆ వెంటనే గోడౌన్ నిర్వాహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కొన్నారు. ఆపై దాడి చేసి ఇన్నోవాలో కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే మణిశర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి 4.కిలోమీటర్ల దూరంలోనే కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా.. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో వున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios