ఇష్టపడి హిజ్రాను పెళ్లి చేసుకుని మోజు తీరాక వేధింపులకు పాల్పడుతున్న భర్త మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లెపల్లికి చెందిన బండారి నాగేందర్ (32), మల్లాపూర్ నేతాజీ నగర్ కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రా కు స్నేహం కుదిరింది.  2019లో వరంగల్ మేడారం జాతరలో దివ్యను చూసిన నాగేందర్.. మనసుపడి 2019 నవంబర్ లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం ఏడాది పాటు ఆనందంగా గడిచింది.

అయితే గత కొన్ని రోజులుగా నాగేందర్ వైష్ణవి అనే అమ్మాయిపై మోజు పెంచుకుని తనను వేధించడం మొదలు పెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది. ఆమెను వివాహం చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని, అందుకు అంగీకరించ మంటూ, మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పోలీసులకు తెలిపింది.

అంతేకాకుండా నాగేందర్ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్న నాగేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.