అబ్బాయిల డ్రెస్సింగ్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుందో మైనర్. బరువుగా ఉన్న జేబులే టార్గెట్ చేస్తే హల్ చల్ చేస్తుంది. ఆ బాలికను నారాయణపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలిక అంతకు ముందు కూడా పట్టుబడిందన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. 

విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా.. సదరు బాలిక మగ వేషధారణలో ఉంటూ కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతోంది. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్‌ శివారులోని తొట్లూరుకు చెందిన వాసురామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు నారాయణపేటకు వచ్చాడు.

ఈక్రమంలో సదరు బాలిక ఆయన జేబులో నుంచి రూ.50వేలు తస్కరించింది. బాధితుడు వెంటనే తేరుకుని బాలికను గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

అంతలోనే అక్కడికి వచ్చిన పోలీసులు మగవేశంలో ఉన్న బాలికను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దగ్గర అప్పుడే కొన్న సెల్‌ఫోన్, దుస్తులపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలా ఉండగా ఈ బాలిక గతంలో చిన్నచిన్న దొంగతనాల్లో దొరికిందని, మైనర్‌ కావడంతో వెంటనే సఖీ కేంద్రం నిర్వాహకులకు బాలికను అప్పగించినట్లు తెలుస్తోంది.