హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లతో కలకలం రేపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుల ఆట కట్టించారు. 

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లతో కలకలం రేపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుల ఆట కట్టించారు. కాజీపేటలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు.. శనివారం ఉదయం రెండు గంటల వ్యవధిలోనే నిందితులు ఆరు చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు చోరీల అనంతరం కాచీగూడ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి పారిపోయినట్టుగా గుర్తించారు. ఆ దిశగా గాలింపు చేపట్టిన పోలీసులు వారిని కాజీపేట రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లో రెండు గంటల వ్యవధిలో దుండగులు 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు . ఓయూ, ఉప్పల్, నాచారం, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్‌లో రెండు, నాచారం, చికలగూడ, రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్కటి చొప్పున చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. చైన్‌స్నాచర్లు తొలుత ఉప్పల్‌లో ఉదయం 6.20 గంటలకు చోరీ ప్రారంభించి.. చివరగా ఉదయం 8.10 రామ్‌గోపాల్ పేటలో ముగించారు. ఇందుకోసం దుండగులు ఒక్క పల్సర్ బైక్‌ను వినియోగించారు. బైక్‌ మీద తిగిరుతూ.. ఉప్పల్, కళ్యాణపురి, నాచారం, ఓయూలోని రవీంద్రనగరల్, చిలకలగూడ, రామ్‌గోపాల్ పేట ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడారు. 

ఏయే టైమ్‌లో ఎక్కడ చోరీ జరిగిందంటే.. 
1. ఉదయం 6.20 గంటలు.. ఉప్పల్ రాజధాని వద్ద
2. ఉదయం 6.40 గంటలు.. ఉప్పల్ కళ్యాణ్‌పురి వద్ద
3. ఉదయం 7.10 గంటలు.. నాచారం నాగేంద్ర నగర్ వద్ద
4. ఉదయం 7.40 గంటలు.. ఓయూ పోలీసు స్టేషన్ రవీందర్ నగర్ వద్ద
5. ఉదయం 8.00 గంటలు.. చిలకలగూడ పోలీసు స్టేషన్ రామాలయం గుండు దగ్గర
6. ఉదయం 8.10 గంటలు.. రైల్వే స్టేషన్ సమీపంలో రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్ వద్ద


ఈ ఘటనలు జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులు పారడైస్ వద్ద వదిలిపెట్టి వెళ్లిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నగరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చని అనుమాంచిన పోలీసులు.. అన్ని రైల్వే స్టేషన్లు, శంషాబాద్ విమానాశ్రయం వద్ద నిఘా ఉంచారు. నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.