స్నేహం పేరిట దగ్గరయ్యాడు. అతని స్నేహం నిజమని యువతి నమ్మింది. స్నేహితుడే కదా అని సరదాగా సెల్ఫీలు దిగింది. అదే ఆమె చేసిన నేరమైంది.  సరదాగా గతంలో తీసుకున్న సెల్ఫీలను చూపిస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినాలని లేదంటే.. ఆ ఫోటోలను అందరికీ చూపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హయత్‌నగర్‌ తట్టి అన్నారం ప్రాంతానికి చెందిన అశ్వక్‌ ఆలీషేక్‌ మారుతీనగర్‌లో ఉంటున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఇంటికి సమీపంలోని యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించాడు. పలుమార్లు సెల్ఫీలు తీసుకున్నాడు. ఓ సారి ఆ యుతిని తన కారులో చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో తిప్పాడు. సరదాగా అంటూ యువతి చేతిలో బీరు బాటిల్‌ పెట్టి ఫొటోలు తీశాడు. 

కొద్దిరోజుల తర్వాత నిందితుడు యువతికి ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించలేదు. అప్పటి నుంచీ దూరంగా ఉంటోంది. దాంతో సెల్ఫీలు, బీరు బాటిల్‌తో దిగిన ఫొటోలు అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. తాను చెప్పినట్లు వినకపోతే.. ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని, వాటిని మార్ఫింగ్‌ చేసి తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.