సాధారణ పౌరులు ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తారు. అదే పోలీసులు మోసపోతే..? ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ కిలాడీ లేడి ఏకంగా పోలీసులకే టెండర్ వేసింది. ఎస్సైలను బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. ఈ సంఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. 

అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.