ప్రేమ పేరిట ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు వేర్వేరు సంఘటనలు అయినప్పటికీ.. రెండూ ఒకేవిధంగా జరగడం గమనార్హం. ఈ రెండు సంఘటనలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read అదృశ్యమైన లేబర్ ఆఫీసర్ దారుణహత్య..?.

టోలీ చౌకిలోని జమీల్ కుంట ప్రాంతంలో నివసించే మహమ్మద్ వలీ(22) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడి కుమార్తె(17) ను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సామర్ల కోటకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వలీని అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 376, 363, రెడ్ విత్ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మరో ఘటనలో బంజారాహిల్స్ లోని సింగాడబస్తీలో నివసించే మొగిలి వెంకటేష్(25) ఐదు నెలల క్రితం ఇంటి సమీపంలో నివసించే ఓ బాలిక(16) తో ఏర్పడిన పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్నే ప్రేమగా నమ్మించాడు. బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ మత్తులో దింపాడు. తర్వాత బాలికను తిరుపతి తీసుకువెళ్లి అక్కడ రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ రెండు కేసుల్లోనూ పోలీసులు నిందిదతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.