అతనిని చూస్తే దొంగ అంటే ఎవరూ నమ్మరేమో. దర్జాగా కార్లలో తిరుగుతూ ఉంటారు. అంతెందుకు అతను దొంగతనానికి వెళ్లేది కూడా కారులోనే కావడం గమనార్హం. తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కీ చేసి.. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం.. దగ్గరలోని హోటల్ లో రూమ్ తీసుకొని మరీ.. ఆ తర్వాత దొంగతనం చేశాడు. కాగా.. ఈ దొంగ తాజాగా పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాగర్‌కర్నూల్‌ జిల్లా రాంనగర్‌కు చెందిన సయ్యద్‌ మహబూబ్‌ పాషా అలియాస్‌ బిర్యానీ పాషా (39) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అదే జిల్లాలోని సత్తాపూర్‌ గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. చోరీ చేయాలనుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఓయో రూమ్‌ బుక్‌ చేసుకొని చోరీ చేసేవాడు. గడ్డపారలతో తాళం బద్దలు కొట్టి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసేవాడు.  వచ్చిన డబ్బులతో కార్లు కొనుగోలు చేసి జల్సాగా తిరుగుతుండేవారు.

ఈ క్రమంలో  పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా.. పీడీ యాక్ట్‌ నమోదైనా మారలేదు. ఈనెల 9న ఉదయం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తారానగర్‌ తుల్జా భవానీ మందిర్‌ వద్ద ఉన్న తన జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగినట్లు సయ్యద్‌ పర్వీనా రెహన్‌ గుర్తించారు. దీంతో బాధితురాలు  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుకాణంలో రూ.3.50 లక్షల నగదు, 15 తులాల బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు పోయాయని  ఫిర్యాదు చేసింది.  
మంగళవారం లింగంపల్లి గుల్‌ మొహర్‌ పార్కు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా సయ్యద్‌ మహబూబ్‌ పాషా కారులో వస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.  
అతనిని రిమాండ్‌కు తరలించి అతనివద్ద 3.5 తులాల బంగారం, 10 కిలోల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు, నాలుగు కార్లు, సిగరెట్‌ ప్యాకెట్లుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు