కొడుకు తమ కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకు వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పదేళ్ల తర్వాత.. కోడలు.. తమ కొడుకుని వదిలేస్తానంటూ పోలీసు కేసు పెట్టింది. దీంతో.. కోడలికి దెయ్యం పట్టిందని.. అందుకే ఇలా చేస్తోందంటూ అత్త, మామ భావించారు. ఈ క్రమంలో భూత వైద్యుడిని రప్పించి ఇంట్లో పూజలు చేయించారు. ఈ తతంగమంతా కోడలి కంట పడటంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన యువకుడు చిరంజీవి, వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి రజిత ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. పదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటకు ఓ పాప పుట్టాక మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. దయ్యం పట్టడంతోనే కోడలు కేసు వేసి కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుందని అత్తింటివారు భావిస్తూ ఆమెను ఇంట్లోకి రానివ్వడంలేదు‌. 

గత కొంతకాలంగా పుట్టింటి వద్దనే ఉంటున్న ఆ మహిళ, కూతురుతో కలిసి ఇటీవల  అత్తవారింటికి చేరుకొని ఆందోళనకు దిగింది.  అయితే.. ఆమెను ఇంట్లోకి రాకుండా అత్తమామలు శంకరమ్మ, అమృతయ్య అడ్డుకున్నారు.

అప్పటికే కోడలుకు పట్టిన దెయ్యం పోవాలని భూతవైద్యుడితో ఇంటి లోపల ఓ తంతు నిర్వహిస్తున్నారు. కోడలు ఇంట్లోకి వస్తే అరిష్టం అని భావించిన మామ అమృతయ్య, కోడలు ఇంటిలోపల అడుగు పెట్టకుండా అడ్డుకుని ఆమెను నెట్టివేస్తు దాడికి దిగాడు. కాగా.. మామను బలవంతంగా నెట్టేసి.. లోపలికి వెళ్లి చూడగా.. భూత వైద్యుడితో పూజలు చేస్తూ కనిపించారు.  దీంతో.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూత వైద్యుడితోపాటు అత్త, మామలను కూడా అదుపులోకి తీసుకున్నారు.