సిద్ధిపేట జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ ఎల్లంగౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. నేరాల్లో తనతోపాటు పాల్గొని.. డబ్బు సంపాదించిన ఇతర క్రిమినల్సే... ఎల్లం గౌడ్ ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడ ఎల్లం గౌడ్ తమను చంపేస్తాడో అనే భయంతో ముందుగానే వీరు హత్య చేయడం గమనార్హం.

కాగా.. పూర్తి వివరాలను పోలీసులు ఇటీవల వివరించారు. సిద్దిపేట శివారులోని ఇమాంబాద్‌కు చెందిన అంబటి ఎల్లంగౌడ్‌ (40) కొంతమంది వ్యక్తులతో కలిసి గతంలో చేసిన రాబరి కేసుల్లో, ఇతర కేసుల్లో డబ్బు పంచుకునే విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. 

ఇదే క్రమంలో ఎల్లంగౌడ్‌కు సిద్దిపేట అర్బన్‌ మండలం తడకపల్లి గ్రామానికి చెందిన తొడెంగల వెంకటేశ్‌కు పలుమార్లు గొడవలు జరిగాయి. 2013 సంవత్సరంలో ఎల్లంగౌడ్‌, వెంకట్‌ కలిసి పేకాట సెటిల్‌మెంట్‌లు చేశారు. అందులో రూ.10 లక్షలు రాగా వెంకటేశ్‌కు రావాల్సిన రూ.5 లక్షలు ఇవ్వకుండా ఎల్లంగౌడ్‌ తన సొంత అవసరాలకు వాడుకున్నారు.

ఈ క్రమంలో ఎల్లంగౌడ్ పై వెంకట్ కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి ఓ సారి ఎల్లంగౌడ్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఎల్లంగౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. తిరిగి కోలుకున్న తర్వాత తమను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో... రౌడీషీటర్ ఎల్లం గౌడ్ ని శాశ్వతంగా లేపేయాలని ప్లాన్ వేశారు.

వెంకట్‌, సంతోష్‌తో పాటు తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన కాస స్వామి, చిన్నకోడూరు మండలం రామంచకు చెందిన ఎడ్ల మధుసూదన్‌రెడ్డి, సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లికి చెందిన చెన్నోజు నవీన్‌, అదే గ్రామానికి చెందిన ఆడె సంతోష్‌, నంగునూరు మండలం ఖానాపూర్‌కు చెందిన చెట్టుగురి రవి, సిద్దిపేటలోని రాంనగర్‌కు చెందిన అనిల్‌ ఒక టీంగా ఏర్పడ్డారు.

20 రోజుల నుంచి ఎల్లంగౌడ్‌ రాకపోకలను గమనిస్తున్నారు. రామంచ, పుల్లూరు, ఇమాంబాద్‌ గ్రామ శివార్లలో ఎల్లంగౌడ్‌ పేకాట ఆడి ఇంటి వస్తున్న విషయం మూడు రోజుల నుంచి గమనించారు. నిందితులు అతన్ని హత్య చేయడానికి రెండు రోజులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 

మూడో రోజైన మార్చి 23వ తేదీన ఎల్లంగౌడ్‌ స్కూటీపై ఒంటరిగా వస్తుండగా రామంచ శివార్లలో నిందితులు కంట్లో కారం చల్లి కొబ్బరికాయలు కొట్టె కత్తులతో మెడపైన, చేతులు, కాళ్లపై నరికి దారుణంగా హత్య చేశారు. ఎల్లంగౌడ్‌ భార్య భారతి ఫిర్యాదులో తొడెంగల వెంకట్‌, ఎడ్ల మధుసూదన్‌రెడ్డి, బెజుగామ సంతోష్‌, సింగిరెడ్డి సంపత్‌రెడ్డి, నరెండ్ల మధుసూదన్‌రెడ్డి, స్వామిలు తన భర్తను చంపారని అనుమానం ఉన్నదని పేర్కొన్నది. దాని ప్రకారం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారు.