హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తంగడుపల్లి శివారులో మరణించి పడి ఉన్న యువతిని గుర్తు పట్టడం సాధ్యం కావడం లేదు. ముఖంపై బండరాయితో మోదడం వల్ల ఆమెను గుర్తించడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా ఆ మహిళను గుర్తించవచ్చునని భావిస్తున్నారు.

వికారాబాద్ వెళ్లే దారిలో తంగడుపల్లి శివారులో అండర్ బ్రిడ్జి కింద నగ్నంగా యువతి మృతదేహం పడి ఉంది. ఓ వ్యక్తి శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఛేదించడానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 

Also Read: మరో ‘దిశ’...ఒంటిపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం

వేరే చోట ఆమెను హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని ఇక్కడ పడేసిన తర్వాత గుర్తు పట్టరాకుండా ముఖంపై బండరాయితో బాది ఉంటారని భావిస్తున్నారు. ఈ నేరంలో ఒక్కరి కన్నా ఎక్కువ మంది పాలు పంచుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఈ నేరం చేసి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ ప్రకాశ్ రెడ్డి చెప్పారు. యువతి శవం పడి ఉన్న ప్రాంతం జాతీయ రహదారికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మహిళకు 30 ఏళ్ల దాకా ఉండవచ్చునని ఏసీపీ రవీందర్ రెడ్డి చెప్పారు. ఏడు గంటల ప్రాంతంలో పోలీసులు మహిళ హత్య విషయాన్ని మంగళవారం ఉదయం గుర్తించిట్లు ఆయన తెలిపారు. వివాహమైందా, లేదా అనే విషయం కూడా తెలియడం లేదని ఆయన అన్నారు. ఒంటిపై బంగారు నగలు ఉన్నాయని చెప్పారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయం కూడా పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే తెలుస్తుందని ఆయన చెప్పారు. చుట్టుపక్కల రిసార్టులు ఉన్న నేపథ్యంలో మహిళ ఏదైనా రిస్టార్ కు సంబంధించిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.