పోచారం...‘వెలమస్తుతి’
వెలమలు సమాజంలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ సంకల్పబలంలో, బుద్ధిబలంలో ఎవరికీ తీసిపోరంటూ ‘వెలమ స్తోత్రం’ అందుకున్నారు.
తెలంగాణాలో కెసిఆర్ భజన పెరిగిపోతోంది. మంత్రిపదవులు కాపాడుకునేందుకు, సిఎం దృష్టిలో పడేందుకు జరుగుతున్న పోటీలో వ్యక్తిని మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కులాన్ని కూడా బ్రహ్మాండమంటూ భజన చేయటం కొత్తగా ఉంది. భజన అన్నది ఎక్కడైనా ఉండేదే. కానీ అది సృతిమించినపుడు నవ్వుల పాలవుతుంది. తాజాగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
నిజామాబాద్ సమీపంలో జిల్లా వెలమ సంఘం భవనానికి శంకుస్ధాపన జరిగింది. సందర్భంగా పోచారం మాట్లాడుతూ, వెలమలు సమాజంలో తక్కువ సంఖ్యల్ ఉన్నప్పటికీ సంకల్పబలంలో, బుద్ధిబలంలో ఎవరికీ తీసిపోరంటూ ‘వెలమ స్తోత్రం’ అందుకున్నారు. చరిత్రను సృష్టించటంలో, సమాజంలో ముందుచూపుతో, ఇతర సామాజికవర్గాల అభివృద్ధి, స్వతంత్ర పోరాటంలో సైతం పాల్గొన్న చరిత్ర వెలమలకు ఉందన్నారు.
తెలంగాణా సాధించేవరకూ విశ్రమించని కెసిఆర్ కూడా వెలమ కులస్తుడేనంటూ మంత్రి పోచారం గుర్తుచేసారు. అప్పటికేదో కెసిఆర్ కులమేదో ఎవరికీ తెలియనట్లు మొదటిసారి పోచారమే బయటపెడుతున్నట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు.
పైగా కెసిఆర్, కవిత, కెటిఆర్, హరీష్ రావులు తెలంగాణా ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినట్లు మంత్రి చెప్పటం విచిత్రంగా ఉంది. ఉద్యమం బాగా ఊపుమీదకు వచ్చి, తెలంగాణా రాష్ట్రం ప్రకటించే రోజు దగ్గర్లోనే ఉందని అర్ధమైన తర్వాత మాత్రమే కెటిఆర్, కవితలు రాష్ట్రంలో అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మాటకు వస్తే అప్పటి వరకూ టిడిపిలో ఉన్న పోచారం కూడా ఉద్యమం బాగా ఊపందుకున్న దశలోనే టిఆర్ఎస్ లోకి అడుగుపెట్టారని అందరికీ తెలుసు.
పోచారం ‘వెలమస్తుతి’ ఎక్కువైపోయిందనుకున్నారో ఏమో కవిత మాట్లాడుతూ, కుల సంఘాలు కులాల అబివృద్ధికి మాత్రమే పాటుపడాలని చెప్పారు. కులరాజకీయాలు కులాల పేరుచెప్పి రాజకీయాలు చేయకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా కవిత తేల్చేసారు.