216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. శనివారం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ముచ్చింతల్‌ చేరుకున్న ఆయన సంప్రదాయ వస్త్రాలు ధరించి యాగంలో కూర్చొన్నారు. అనంతరం చిన జీయర్ స్వామితో కలిసి 108 దివ్య తిరుపతులను సందర్శించారు. 
 

pm Narendra Modi unveils the samantha murthy statue at chinna jeeyar swamy ashram muchintal

కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీ రామానుజ బోధనలు స్మరించుకుంటూ 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని నరేంద్ర మోదీ నేడు లోకార్పణ చేశారు. ఈ విగ్రహం నెలకొల్పిన హైదరాబాద్‌ శంషాబాద్‌లో ఉన్న  కేంద్రాన్ని ఆయన సందర్శించారు. 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలోని 108 దివ్యదేశాల నమూనాలను తిలకించారు.

ఫిబ్రవరి 2, 2022న ప్రారంభమైన శ్రీ రామానుజుల 1000వ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న 12 రోజుల శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాల్లో భాగంగా సమతా మూర్తి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తజనులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి దగ్గరుండి నిర్వహించారు.

బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్‌తో కూడిన పంచలోహాలతో సమతా మూర్తి విగ్రహాన్ని రూపొందించారు. భద్రవేదిగా పిలిచే 54 అడుగుల ఎత్తైన భవనంలో ప్రత్యేకమైన వేద డిజిటల్‌ గ్రంథాలయం, పరిశోధన కేంద్రం, పురాతన భారతీయ స్మృతులు, ఒక థియేటర్‌, శ్రీ రామానుజుల బోధనలు వివరించే విద్యా గ్యాలరీ ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని శ్రీ మోదీ మాట్లాడుతూ.. సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ ఘట్టంలో పాలుపంచుకుంటున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని అన్నారు. నిజానికి ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ క్షణమని... భారతదేశంలోని ఎంతో మంది మహోన్నతుల్లో ఒకరు శ్రీ రామానుజాచార్యులు. కులం, మతం, లింగం మధ్య సమానత్వాన్ని మనకు ఆయన ప్రబోధించారని మోడీ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన జనాభా కలిగిన మన దేశం ..సమానత్వాన్ని దృఢంగా నమ్ముతుందని చాటి చెప్పేందుకు ఈ సమతామూర్తి విగ్రహాం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమానత్వం, ఐకమత్యానికి చిహ్నంగా నిలిపే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీకి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.

చిన్నజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. 1000 సంవత్సరాలుగా సమానత్వానికి నిజమైన ప్రతిరూపంగా భగవద్ రామానుజాచార్యులు నిలిచారని అన్నారు. ఆయన బోధనలు కనీసం మరో 1000 సంవత్సరాలు ఆచరించేలా ఈ కార్యక్రమం చూస్తుందని చినజీయర్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ సమతామూర్తి ఒక అత్యున్నత సాంస్కృతిక గమ్యస్థానంగా నిలిచి ప్రతీ ఒక్కరూ జీవించేందుకు సమానమైన ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని నిలిపేలా అందరిలో ప్రేరణ కలిగించాలన్నది తమ లక్ష్యం అన్నారు.

అగ్నిదేవుడికి ఆజ్యం సమర్పిస్తూ  శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంతో  ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. 5000 మంది వేదపండితులు, 1035 యజ్ఞకుండాలు, 144 హోమశాలలతో కూడిన మహాయజ్ఞాన్ని ఫిబ్రవరి 2, 2022న ప్రారంబించారు. ఆధునిక చరిత్రలో ఇది ప్రపంచంలోనే అది పెద్ద యజ్ఞం. ఫిబ్రవరి 13, 2022న రామానుజ అంతర్‌ నిర్మాణాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు.

శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగు వేదాల్లోని తొమ్మిది శాఖల పారాయణం, మంత్రరాజంగా పిలిచే అష్టాక్షరి మహామంత్ర జపం, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమ శాస్త్రాల పఠనం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అష్టాక్షరి మహామంత్ర జపం ఈ వేడుకలు ముగిసే నాటికి ఒక కోటికి చేరుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన 2014లో జరిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios