ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చే అవకాశం వుంది. మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలంతా త్వరలో తెలంగాణకు క్యూకట్టే అవకాశం వుంది.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు రాష్ట్రంపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఎన్నికలు ముగిసే వరకు క్రమం తప్పకుండా తెలంగాణకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెద్దలంతా అక్కడ బిజీగా వున్న సంగతి తెలిసిందే. అక్కడ ఎన్నికలు ముగిసిన అనంతరం కమలనాథుల టార్గెట్ తెలంగాణయే. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారంలోకి రావడానికి అత్యంత అనువుగా వున్న రాష్ట్రం తెలంగాణయే కావడంతో ఈసారి అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగించే అవకాశం వుంది.
ఇదిలావుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఇకపై తెలంగాణకు క్రమం తప్పకుండా రానున్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తారని సమాచారం. సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో.. మరుసటి రోజే తెలంగాణ పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు జహీరాబాద్, నారాయణపేటలలో సభ నిర్వహించాలని కూడా కమలనాథులు భావిస్తున్నారట.
Also Read: ఓఆర్ఆర్ లీజులో ఎన్‌హెచ్ఏఐ నిబంధనలకు నీళ్లు: కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి
ఇప్పటికే గత నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. దీనితో పాటు ఎంఎంటీఎస్ పనులకు కూడా ఆయన కొబ్బరికాయ కొట్టారు.
అంతకుముందు ఓఆర్ఆర్ లీజుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. హెచ్ఎండీఏకు 30ఏళ్లలో టోల్ ట్యాక్స్ ద్వారా రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఓఆర్ఆర్ పై ఆదాయం పెరుగుతుంది తప్ప, తగ్గదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు లీజుకు ఇచ్చినట్టుగా తెలంగాణ సర్కార్ చెబుతున్న మాటలను కిషన్ రెడ్డి తప్పు బట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ , ఓఆర్ఆర్ ను ప్రైవేట్ సంస్థకు ఎందుకు లీజుకు ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
