త్వరలోనే భారతీయ రైల్వే ఎలక్ట్రిఫికేషన్: నిజామాబాద్‌లో రూ. 8వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
తెలంగాణలో రూ. 8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతికి అంకితం చేశారు.
నిజామాబాద్: త్వరలోనే భారతీయ రైల్వే వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారంనాడు ప్రారంభించారు. నిజామాబాద్ నుండి వర్చువల్ గా పలు కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు.సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు.మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్ ను, 20 క్రిటికల్ కేర్ బ్లాకులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మోడీ చెప్పారు. బీబీనగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ధర్మాబాద్-మనోహరాబాద్-మహబూబ్ నగర్-కర్నూల్ రైల్వే లైన్ విద్యుత్ లైన్ ను పూర్తి చేసుకున్నామని మోడీ చెప్పారు.ప్రపంచంలోనే అతి పెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తున్నామన్నారు.
పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్ ను ప్రారంభించుకున్నట్టుగా మోడీ చెప్పారు.త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని చెప్పారు.తమ ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుందన్నారు. ఇది తమ వర్క్ కల్చర్ గా ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ లో పాలమూరు ప్రజా గర్జన సభను బీజేపీ నిర్వహించింది. ఈ సభ సందర్భంగా తెలంగాణలో రూ. 13,545 కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ వేదికగానే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేకాదు ములుగులో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.